మెట్టినింట ఉన్నదంటా, తొల్త పంట కలిగెనంటా
నిండారా చూలాలంటా, కండా జవము లిచ్చెనంటా,
కన్నతల్లి సీతమ్మతల్లి అడవిపాలాయెనంట, అకటా!
ఏమని మిము పిలుతుము ఓ చిన్న జీయరు సాములూ!
మాపంటా రేపంటా పగలూ రేయి పబ్బమంటా,
చేతకాని వారమంటా జాతి మేలు తలవమంటా
మాయదారి మడుసులలో మతిలేదిదేమి తంటా?
ఏమని అడిగేము మిమ్ము ఓ చిన్న జీయరు సాములూ!
అలనాటి భూమి అంటా అంతా పంచుకున్నారంటా
పందెమాడ రమ్మని, ఉన్నదంతా వొల్చుకున్నారంటా
అంత సత్తా ఉండీ వారడవుల పాలయినారంటా
ఏమి చెప్పుకుందుమో చిన్న జీయరు సాములూ!
పంట చేల మందులంటా, పురుగులను దీసేస్తదంట
పురుగులు తోబాటే ఆరి పొలాల మట్టుబెట్టెనంట
పొలంగట్ల రైతన్నలు పురుగుల మందుతో పోయిరంట
ఏమి చెప్పమ౦దురు మా చిన జీయరు సాములూ!
పాములను చూస్తిమి, మడుసులను సూస్తిమింటా
పాముకున్న నియమాలు మడిసి మరిసి పోయెనంట
ఎన్ని సార్లు కాపాడెనో ఎంకటేసుడు మా వెన్న౦ట!
ఏమి చిత్రమో ఏమో మా చిన జీయరు సాములూ!
రాయంటా రత్నమంటా, రెంటి జూడ ఒకటే నంటా
సానపెట్టినంత గాని దాని ఇలువ తెలియదంటా
రాళ్ళల్ల రవ్వల వలె మెరిసె దొరా, తెలిసే దెట్లా?
ఏ ఇద్దెలు నేర్సుకోము మా చిన జీయరు సాములూ?
పెద్ద పెద్ద చదువులంటా పల్లెటూళ్ళ చేరెనంటా
ఉన్నోరికి లేనోరికి ఒక్కతీరు పాటాలంటా
పల్లెతల్లికి పనికొచ్చే తెలువులున్న మేలంటా
ఏ ఇసయం తెల్వాలే మా చిన జీయరు సాములూ?
బాసంటా ఊసులంటా, పనులంటా పనిముట్లంటా
చేతనైన వారికీ నెత్తికెక్కినంత సదూసందెలంటా
ఏతామేసే బడుగు మనిసికి మరి? నీ కాలు మొక్తా!
తెలుపగ వశమా మీ దయ హిమవన్నగమంతగా,
దారి తెన్ను తెలియని మమ్ముధ్ధరించుటకు మీరు,
కూపం వలెనే లాగుతున్న సంసారచక్రంలో జీవన యానం
వారం వారం కొలువైన రాముని ధ్యానమే మరీచికయౌనే
మనుషులమనబడు మేము నిజముగ మనీషులమే, మేమే?
ఏ విధి గట్టెక్కగలమో మీ చల్లని దయ వినా
మా విధి నిర్వహణ ఎట్లున్నదో మీ కరుణా
మీ కృప యెల్లరకూ కొల్లలుండాల అడియేన్
తామసపు బ్రతుకులు మావి చిన్నజీయరు స్వామీ
సోమరితనం మూర్ఖత్వం అణువణువునా కలవు
కాపాడవె కరుణ తోడ త్రిగుణాలను సరిజేసి నీవు
కలనైనను నీ తిరుమంత్రం మరువనీకు గురుదేవా
వెయ్యరో దరువెయ్యరో శాన్నాళ్ళాయెవారిని జూసి
కోయరో పంటచేలు కంకులన్ని కంటి నిండుగ నవ్వె
కాయరో మనుసులని, కట్టాలు బాప కైమోడ్స మీకె
అయ్యారె బల్ మన చిన్నజీయరు స్వామివోరు
కన్నతల్లి కన్న మిన్న మరల జలమ నిచ్చినారె
కొత్త కొత్త విద్దె లొసగి కొంగ్రొత్త నామ మిచ్చినారే
రైతుబిడ్డ రౌతు కొడుకు కడుపు సల్లంగుండాల
మాఘమాసం నెల నాళ్ళు, సంకురేతిరి సీకట్నే గోపెమ్మలంత
నల్లానల్లని యమునలోన మెల్లామల్లన గూడి తానాలనాడ
నల్లనయ్య, వెన్నదొంగా కోకలన్నీ మెల్లన దోచెనేల తెల్పరయ్య
ఒక్కరొక్కరు, అగో సూడండ్రి, చల్లని తండ్రి మా చిన్న జీయరు స్వామి వోరూ,
అదిగో ఆ పచ్చచీర అద్దకంతో నేసినాది, అది కాది, నాది నీలి సీర
నల్లనయ్యా నెమిలికంటిది, ఎర్ర రైకా తెల్లకోక ఇవ్వరో యని రోదిస్తూ
ఆ వంక జూడుండ్రి అయ్యా దేవా, చిన్న జీయరు స్వామీ
ఘనమైన కేశాలను వీపు నిండా జారవిడిచి అడుగుతుంది
ఆయమ్మి, గోపమ్మ తల్లిరో, కన్నయ్యా ఇదుగో నీకు అప్పుడే
తీసిన వెన్న పెట్టెదనంటా కటా కటా వొనుక్కుంట కట్ట సీరాలా నడిగే
ఏమి చెప్పుకోము స్వామీవోరు చిన్న జీయరు దయాళూ,
నగుకుంట నగుకుంటా గిట్ట నాలుగు మాటలే సెప్పిండ్రూ
నల్లానయ్యా గొల్లాభామల, నోములపంట నేను గాదాయనె,
పల్లరంగూ కేశాలను పైకంటా యని నెమిలిపింఛెం దోపుకోని
అంతలోనె అనదొడిగె ఎన్నో నీతులు, చిన్న జీయరు స్వామీ
జీవాతుమ పరమాతుమ దరిశెనమూ కలగ జేసె తేటతెల్లగ
మాయమాటలు కావమ్మీ మురళీ లోలుని వేయి మీటలు
వేణువు వాదనలో శరచ్చంద్రుడు కోటి వెలుగులు చిందించగ
ఎవరికి మొరలిడుదు నేను చిన్న జీయరు స్వామి వారు,
మనసు చంచలము మా మాట వినకనున్నది సుంతయు
చైతన్యమే ప్రకృతి అయినను,
అందున ఏదో మతలబు ఉండె
దానిని ఛేదింపను సాధనయే ఓంకారమై ప్రణవ నాదమై ఉద్ధరింపు కదా!
ఏమని చెప్పము మా బాగ్గెము చిన్న జీయరు దేవా
రాముని సన్నిధి వలె, మా కంటిలోన గూడుకట్టి,
గుండె లోన నిండి పోయి ఉండిపోనాదా దేవ నీవే
కన్నవోళ్ళు, కన్నవోళ్ళ కన్నవోళ్ళు కన్నోళ్ళకు దణ్ణాలు
చిన్న
జీయరు స్వాములూ, మీ పాదాలకు అనేకానేక దణ్ణాలు
వారు తిరిగేదేమో గరడగమనం అంట- పన్నేదేమొ పన్నగం మీన అంట,
ఆ రెంటికేమొ అస్సలు పడదు,
ఎట్టెట్టా కుదురుస్తారో ఈ తంటాలు
తెలుపురయ్య దయచేసి, ఎరుకలేని వోరమయ్య, ఎనలేని దయగల వోరు!
శ్రీరామా, వరాలిచ్చు జియ్యరు సామీ మీరు,
ఊరకున్న చెరువులోనే రాలను విసిరినట్టు,
మారేమీ అననివార ఊరినుండి తరిమినట్టు,
మౌనముగా ఉండువారికేల హానికలుగునొకో
తెల్లని మేని ఛాయ వెడదైన కలువకనులు
చిరునగవుల మోమువారలు,
భారమంత తీర్చువారలు
ఎవరయ్య వారలు రాములోరు అసుంటి
మా చిన జీయరు సాములోరు
కోటి కోటి భక్తావళి కోరి మిమ్ము శరణు వేడంగ
చిన్న జీయరు స్వామివోరు ఒసగినారు మాకు బహుమూల్య రత్నంబు
శ్రీరామ శ్రీరామ యనుచు రామకోటి జపియించ
సంచిత కర్మలన్నియు కారాకులవలె దొరలి వేగమె గతియించె శ్రీనివాస
ఎంత గొప్ప విషయమో మన చిన్న జీయరు స్వాముల వోరు
అమ్మవోలె, అయ్యవోలె, ఎల్లారకు దారి చూపు
భారతాంబ ముద్దు బిడ్డ పద్మ భూషణులు వీరలు
మన కన్నుల పున్నెం,, పున్నమి సెంద్రులకు పల్లాండు పల్లాండు
చిన్న జీయరు సామీ, మీనే మా కండ్ల కాంతి, శరణార్థులం దేవా,
మా దిక్కు సూసి దిక్కు తెల్పే వోరలెవ్వారు మిమ్ము వినా
జపము నేదు తపము తెల్వదు, ఈశ్వరుదు ఏడున్నడో ఏమన్నా
తెల్వలేదు. సుడిగాలిలోన దీపమోలె ఉన్నది మాలోని చేతనం..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి