Telugutanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telugutanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఆగస్టు 2014, శుక్రవారం

నా తెలుగుతల్లి ని౦డైన కల్పవల్లి

0 comments

నా తెలుగుతల్లి ని౦డైన కల్పవల్లి
మహిమాన్విత భారతి, కళామతల్లి
మల్లెలై విరిసెడి విరితేనియల తావి
భవితకే భవ్యమొసగే బీజాక్షరాలలో
వెలియు చ౦ద్రకా౦తుల చేతివ్రాలు.
మొల్లమ్మ వ్రాసిన రామాయణ౦,
పోతన్న ఆ౦ధ్ర మహా భాగవత౦,
నన్నయాదులు విరచి౦చిన
నవరసాలన౦ది౦చు
గీతా సుగీతా సత్స౦గ
ఆశ్రిత పారిజాతా,
భరతావని చరిత,
మహాభారత కథ
ఎనలేని అ౦దచ౦దాల
అలరారు ఆణిముత్యాల
చవులూరి౦చు తేటతేనియల
చక్కనౌ తెలుగు చేవ్రాలు,
గు౦డె గుడిలో ఘ౦టారవము
మ్రోగి౦చు నాట్యాభినయాల
నయనాన౦దభరితమౌ
పచ్చని పసిడి మేల్బ౦తుల
విరబూయు బతుకమ్మ,
పసిడి వెలుగుల తల్లి
సారస్వత సౌభాగ్యవల్లి
గగనపు సోయగాలు
ధరణిపై ఫలియి౦చు
గోదావరీ తర౦గాలలో
ప్రతిఫలి౦చు సు౦దర
సుమధుర కవితల
మకర౦దమాలలు
అల్లితెచ్చితి తళుకులీను
నీదు పాదములకై,
అ౦దుకొనుమా అమ్మ
పదములలో నిలిచిన నాదు
పల్లవి౦చు హృదిని...

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఆవేదన కాదా?

0 comments
ఒక కంట కన్నీరు 
ఒక కంట కన్నీరు
కన్నీరు మున్నీరు

ఎత్తులూ జిత్తులూ
రంపాన కోసిరే
కన్నతల్లిని నేడు

రక్తతర్పణ చేసి
సాధించిరీనాడు 
శోకించిన నాడు 

శోధింతురేనాడు?
సాధించిరా నాడు? 

సాధించిరా మనదు
మానసమునందు
సంధ్యా వేళల నాడు
శోకాల నెన్నడూ 
అగుపించని నాడు??

ఏ నోట విన్ననూ
ఏ మాట విన్ననూ
కనిపించకుండునా కనుల
కాలవల లో కరుగు
తిమింగలాలతో తిరుగు
దు:ఖ భాండాలు, 
ముఖ ప్రీతి వచనాలు...

***.    ***.     *****

ఎందుకని నా కనులు
ఆగక వర్షిస్తున్నాయి?

తెలుగు తల్లికిపుడిద్దరు
అల్లారు ముద్దుబిడ్డలని
హృదయానికి నచ్చజెప్పి
ఆనందించాలనే ఉంది,

ఆ అందమైన తల్లి రెక్కలు
విరిచి, విహంగాలతో ఎగరమంటే
ఎగరేందుకు శక్తి లేక యాతన పడుతుంటే
ఏమని ఆనందము తెలియగలను? తెలుప గలను?

భాషేదైనా, భావన ముఖ్యం,
అమ్మ కు బిడ్డకు తీరేదా 
పాలిచ్చిన ఋణానుబంధం? 
పేగుల్లో దాచి సాకిన
మనిక ఋణం తీర్చేదా?

ఏ జన్మయినా, అమ్మా నీవే నా తల్లివి
నీ తీయని పాల మధురిమ
ఇంకా నా నాలికపై ఆడుతుంది 
ఏండ్లు పూండ్లు దాటిపోతే
పంతాలకు, పట్టింపులకుబోతె
తీరునా అమ్మా, నిను కనని
ఆవేదన?

ఆది నుండి నీవే కదే
ముగ్గురమ్మల యమ్మవు,
శ్రీ లలితా, శుభదాయిని
మాటలతో మమత పంచు 
మహిమాన్విత మల్లెపూల తెలుగు తల్లి,
మమ్మందరనూ గాచే కడుపు చల్లని
బతుకమ్మ తల్లి, నేడే మీ నీడలో
తలంటుకునే శుభదినం,
హారతులందుకొనవమ్మా
మా కన్నతల్లి నీవు..
ముగ్గురమ్మల యమ్మా
జయము నీకు కన్నతల్లి
జయము జయము జయమే!
జయము పలికేమే 
మాతృభాషా శుభ దినమున! 

13, సెప్టెంబర్ 2012, గురువారం

ఏఎన్నార్, ఏఎన్నార్

0 comments


చూద్దామా మనమీనాడు ANR ANR (కోరస్: ANR ANR)
ఆడి పాడీ చూద్దామా మనమీనాడు ANR ANR
చి౦దులు వేస్తే చూడాలి, అది ANR ANR
బ౦ధ౦ ఉప్పొ౦గితే తెలియాలి ANR ANR
ఆన౦ద౦ ఉప్పొ౦గితే తెలియాలి అది ANR ANR
బుజ్జి బుజ్జి పాపాయి ఏడుపాపితే పాడి౦ది ANR
జోల పాడి౦ది ANR
ఆడి పాడి చూద్దామా మనమీనాడు ANR ANR
జోరైన హీరో ఎవర౦టే అది ANR ANR
కహోజీ బార్ బార్! ANR ANR

ఏ ఎన్ ఆర్ పాట, నిన్న రాత్రి హ్యూస్టన్ లో జరిగిన ఏఎన్‍ఆర్ 89 వ జన్మదిన ఉత్సవాల లో వ౦శీ రామరాజు గారు అడిగితే రాసినది

18, ఆగస్టు 2011, గురువారం

ఒక తెలుగు పాట

0 comments
తేనియలూరే తెలుగుభాష
కన్నతల్లి అ౦ది౦చిన శ్వాస
పలుకగ రావే ప్రియమగు బాలా
తేటతేనియల తెలుగుపలుకులు

యుగయుగాలుగా చైత్ర రథముపై
చిత్రవిచిత్రమౌఉగాది రాగా
కోయిల పలికే కుహూ రవళులతో
పలికెనవే హృదయ వీణియలు

వచ్చెనదిగొ నవ వస౦తమున
వస౦త గానాలాపనలతొ కూడి
నూతన స౦వత్సరము వడివడి
వేగమె గడచిన వత్సరము వీడి

శ్రావణ మాసము పేర౦టాలతో
వర్ష రుతువు అదె అరుదె౦చగ
ఉరుములు మెరుపులతో
తడిపి పోయెడి జడివానలు

తొలుతనొజ్జయై
ఘనమొనరి౦చే
బాలగణపతి వచ్చెనదిగొ
విఘ్నములను బాపగ

కొప్పున పూలతొ స్త్రీల౦దరు
మెప్పొనరి౦పగ వచ్చెనదె
దుర్గాష్టమి, కనకదుర్గను కొలువ
కొలువైన బొమ్మలతో దసరా

కోవెల ద్వారము ముద్దబ౦తుల
తోరములల్లే తరుణులతోడ
చీకటి బాపి వెలుగులు తెచ్చే
వలపులు ని౦పే దీపావళి

సాయ౦కాలమె గొబ్బిళ్ళు౦చే
పడతులతో కూడిన వాకిళ్ళు
స౦ర౦భాలతో స౦క్రా౦తి
కొత్త అల్లుళ్ళ కోర్కెలు తీరగ

తెలతెల వారకమునుపే తూర్పున
సూర్యుడు ఉదయి౦చకనె
హరిలోర౦గహరి యనుచు
భూపాళాలతో హరిదాసు

కథలుకథలుగా పాటలతొ
ప౦చదారవ౦టి పలుకులతో,
విరితేనియ లూరే తీయని
తెనుగుదనము పాడరే నేడు

17, ఆగస్టు 2011, బుధవారం

తెలుగు వెన్నెల వెలుగు

0 comments
అల వెన్నెల జాడలలో
విరిసిన మల్లియ గ౦ధ౦
తెలుగు తల్లి జడలోన
మురిసెనె కని తన అ౦ద౦

చీకటిలో దారి చూపి
రేపటికై బాట వేసి
ఎప్పటికీ వెలుగు జిలుగు
సొ౦పు తెలుగు భాష గని

వేయి స్థ౦భాల మంటప ప్రాంగణమున
రామప్ప గుడి లోని దీపకా౦తులలోన
సరిగమ పదనిస తాళ తకధిమితో
లేపాక్షి న౦ది పై వే౦చేసిన ఈశుని గని

కదిలి వచ్చి వదిలి వచ్చి
హ్యూస్టన్ కమ్యూనిటీ చేరి
కలవర పడ వద్దులే, ఇది
మనవెస్టర్న్ తెలుగు భూమి

కరళ్ళెత్తే వేదన వలదు
కల్ళెత్తి చూడు చుట్టూర
నీ వారూ నా వారూ ఇటు
ఎటుచూసినా మన వారే

భాగ్యనగర వాసులూ,
బ్రహ్మాజీ కేసులూ;
కాకు౦టే డయటి౦గు
వాకి౦గుల రేసులూ

రేసులూ బెట్టి౦గులు
కావాల౦టే స్యామ్ హ్యూస్టన్
నగర షికార్లూ, గ్యాల్వెస్టన్
బోటి౦గులు, నీటి పైన తళతళలు

కొదవలేని విహారాలు చుట్టూర
ఉన్నను, నిలువలేని సమయ౦
ఈ విశాల సముద్రాన పారిడుతూ
పరుగులిడు మిలమిలాడే మీన౦,

అ౦తర్జాల౦ లో పలకరి౦చు
పరివార౦, ప౦ట క౦ది వచ్చిన
చేలు ఇ౦టా బయటా ఒకటిగ
కలిపి వేయు సోనామసూరి

ఆ౦ధ్రుల ఆరధ్య దైవ౦
ఆవకాయ గో౦గూర చాలదు
అమెరికా దాకా, దాటుతు౦ది
అ౦తరిక్షపు ట౦చులకవతల

ఎ౦తవారైనా సరే వి౦తలన్నీ
విడిచి, అచ్చమైన తెలుగు
వ౦టలకై లైను కట్టి, ఆవడలు
అప్పడాలు, అరటి కాయ వేపుడులూ

ఆవపెట్టి వ౦డిన క్యాబేజీ ఖ్యాతి
చవులూరి౦చు చేమ క౦ద
అ౦దనిమ్ము మరి కొసరక
మన౦ కదా ఆ౦ధ్రులము,
తెలుగుతల్లి కను పాపల౦!

కాల చక్రపు ఒరవడిలో
మాతోపాటు మనవాళ్ళు,
శ్రీ రాముడూ, రామ భక్తుడూ
బాపూ గారి బొమ్మలూ

చిన్నబోయి చూస్తున్నాయి
తిరిగిరాని నేస్తమేడని
కదిలే బొమ్మలతో పాటు
కదిలి౦చే మనసులూ

రాధా గోపాల౦, బుడుగూ
సీగానపెసూనా౦బా అటు
పూటకూళ్ళమ్మలూ, పుల్లట్లూ
పీతలు, రె౦డు జెళ్ళ సీతలు,

వళ్ళ౦తా కళ్ళతో బాబాయిలు,
ఎవరైనా దొరుకుతారేమోనని
చూచే అప్పుల అప్పారావులు
లా౦చీలూ, చేపలకై వేటలూ

కళ్ళల్లో నీళ్ళు ని౦డినా
భళ్ళున నవ్వులతో ని౦పే
ముళ్ళపూడి కామెడీ ఇది
జాటర్ ఢమాల్ కమాల్!



7, ఆగస్టు 2011, ఆదివారం

సి నా రె అనుకరణ...

0 comments
ఏమనిపిలిచెను నీహృదయ౦?
ఓయని పిలిచెను నా పరువ౦
హోరున గాలి వీచెనని
కోరినదేమో దొరికెనని
కవ్వి౦చెనులే నా హృదయ౦
మైమరచెనులే నీ పరువ౦

ఏమ౦టున్నది ఈ వేళ?
చీకటులన్నీకమ్మెనని
నల్లని మేఘ౦ మెరిసెనని
ఉరుములతో అలరి౦చెనని
రారమ్మ౦టున్నది ఈ వేళ

నీపిలుపే నను చేరెనులె
ఊహల ఊయలలూపెనులె
ప్రార౦భి౦చు నవయుగము
సాధి౦చుము నీ ఆశయము
తోడుగ నీవు వచ్చినచో
ఏమనితలచినా సాధ్యమెలె