ముచ్చటగా మూడు పుస్తకాలు
మాట్లాడుకొంటున్నాయి
మేమంటే మేమే గొప్ప అని
పోటీలు పడుతున్నాయి
ముందుగా,మందంగా
ఆర్టు పేపర్ కవర్ తో
స్మార్టుగా తయారైన
సరికొత్త పుస్తకం
నా అట్టలు చూడు,
నా పుటలు చూడు
నా ఆర్టు, పార్ట్ పార్టు జూడు
అని పాట కచ్చేరీలు చేస్తుంది.
ఓసి నీ కమ్మలు బంగారం గాను,
ఇంతకే? అంది
బంగారంలా మెరిసిపోతూ,
మురిసిపోతూ
మిలమిలలాడే,
మిరుమిట్లు గొలిపే,
ధగధగలాడే వెన్నెలలా
మెరిసే మరొక పుస్తక రాజం.
నా క్లాసు చూడు,
నా భాష చూడు,
నా నెనరు చూడు,
నా ఒనరు చూడు!
క్లాసిక్, వీరు క్లాసిక్
అని కోర చూపులతో,
ప్రగల్భాలు కోసి కోసి
కూస్తుంది ఒక మహా కావ్యం…
ఇంతలో, తందానా
తాన తందనానా అందామని,
గొంతు సవరించుకుని,
కాగితాలు జారి జారి పోతుంటే,
బీరలు పోకుండా,
మెడ నిటారుగా నిలిపి
మేకప్ లేకున్నా మైక్ ముందు
మాట్లాడ దలుచుకున్న వీరుడిలా
ముఖపత్రమే లేకున్నా, ధైర్యంగా,
సూటిగా, సూటు బూటూ
ఆర్భాటం లేకున్నా,
చిరునవ్వుతో పులకరిస్తుంది,
మరొక
దేశవాళీ దిశాకారి,
పత్రాలు కోల్పోయిన
పాత పుస్తకం.
ఇటు జూడు,
అటెటో కాదు ఇటు సూడండి
అంటున్నది,
నేనే, నీకు ఓనమాలు
దిద్దించిన పెద్ద బాలశిక్షను
నీ తొలి పాఠం
అందించిన
తొలి మెట్టును
నీకు తొట్టతొలుత
మెప్పులందించిన
కప్పురపు వసంత
రాయ వాచకాన్ని
అచ్చమైన
మల్లెపూల
తెలుగు వాచకం నేను!
మరచిపోకు మిత్రమా
మనది జన్మజన్మాంతర
బంధం!
అనుబంధం!
అంటున్నది!
దాని మాటలోనే
దాగుంది అనంతం!
ఆనందం!
విడువలేని బంధం!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి