ప్రియమైన అమ్మమ్మ శ్రీపాదపద్మములకు వేవేలు నమస్కరించి,
ఉమ వ్రాయునది. ఉభయకుశలోపరి..
అమ్మమ్మా, ఎంత కాలమయిందే, నీతో మాట్లాడి! ఏమిటో, ఏమి మాట్లాడాలన్నా, ఈ లోకం లో లేవు, ఎంత దూరాన ఉన్నావో తెలియదు…
నువ్వు నా కెంతొ ఇష్టం అమ్మమ్మా, ఐ మిస్ యూ వెరీ మచ్. కళ్ళు మూసుకుంటే గిర్రున కళ్ళళ్ళో నువ్వూ, నీ పాటలూ, మాటలూ, ముఖ్యంగా ఆ కాలపు రేడియో నాటకాలు, గణపతి, కన్యాశుల్కం లో గిరీషం ది గ్రేట్, ఇంకా బుజ బుజ రేకుల పిల్లుందా, బొమ్మరిల్లు ఆటలూ పాటలూ, అన్నీ సినిమా రీళ్ళలా నడుస్తూనే ఉంటాయి!
… … ...
ఆ పల్లె, పల్లేరు కాయలు, ఆ తోట, తోటలో ఎంతో లోతైన దిగుడు బావి, తోట లో ఓ ప్రక్కన శాంతినికేతన్ లాగా పాఠశాల, పాఠశాలకు ఎదురుగా ఆవరణ, ఆవరణలో జాతీయ పతాక, శిరసెత్తి గగనాన అలరారుతుంటే, చెంతనే బోసి నవ్వుల తాత గారైన గాంధీ మహాత్ముని విగ్రహము, చేతి కర్ర, ఆ కళ్ళ పైన అద్దాలున్నాకళ్ళల్లో అకుంఠిత దీక్ష తత్పరత! గాంధి మహాత్ముడు చకచక నడవగ జగత్తు నడిచిందీ అని పాటలూ, ప్రొద్దున్నే ప్రార్థన, ప్రమాణము, తదుపరి పాఠ్యాంశాలు, పెరిగింది బస్తీలోనే అయినా తాతగారి ఊరికి వెళ్ళాక, శెలవులైనా ఊరి బడి రోజూ ఉదయం ఏడున్నర నుండి, మధ్యాహ్నం మూడు దాకా రోజూ బడికి వెళ్ళేవాళ్ళం కదా అమ్మమ్మా!
అంటే, ఎప్పుడైనా వెళ్ళబుద్ధి కాకుండా బడి ఎగ్గొట్టాలంటే, అక్కేమో ‘అమ్మా నొప్పులే, అమ్మమ్మా నొప్పులే పరీక్షకని నే పాఠం చదివితే అమ్మా నొప్పులే ‘ అని, ఎక్కిరించి పరిగెట్టేది బడిదాకా, నేను మనసులో తిట్టుకుని బడికేళ్ళేదాన్ని, చిరిగిన చెప్పుకి పిన్నుసూది గుచ్చుకుని, ఒక్కో అడుగూ వేస్తూ, బడిదాకా పలకాబలపం సంచీ మోసుకుని..
దారిలో ప్రొద్దున్నే భూపాళాలు పాడుకుంటూ, ఆవుల మందను తోట ప్రక్కగా ఉన్న గడ్డిమేట వైపు పిల్లవాళ్ళు మేతకు తీసుకెళ్ళడం, మనసులో ఏమో 'పల్లెటూరి పోరాగాడా పసులగాసే మొనగాడా పాలుమరచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడా ..పట్నవాసం ఎరగనోడా .." పాడుకుంటూ..ఆ జ్ఞాపకాలన్నీ ఎక్కడి నుంచో ఎప్పటి నుండో ముప్పిరి కొంటూ మనసంతా కలచి వేస్తే, నీ ఓదార్పు మాటలూ, శుక్రవారం పిల్లలందరికీ సాయంకాలం భజన తరవాత నువ్విచ్చే మిఠాయిలు, ప్రసాదం గుర్తొచ్చి మనసు నిండా నువ్వే నిండిపోతావు కదా అమ్మమ్మా!
పిల్లలం అందరం నాలుగున్నర వరకు ముఖాలు కడుక్కుని, ఏవైనా పండు ఫలహారం ఆరగించి; మళ్ళీ గుంపు అందరమూ కలిసి శుభ్రంగా రెడీ అయ్యి, ఎంతెంత దూరం, కాసింత దూరం అనుకుంటూ, తోటకెళ్ళి, తోటలో మామిడి పళ్ళు, జామపళ్ళూ కోసుకుని, అక్కడే కాస్త ఉప్పూ, కారాలు అవ్వనడిగి చల్లుకుని సాయంకాలం ఆనందంగా పరిగెడుతూ పాటలు పాడుతూ, ఆ రోజుల మధుర జ్ఞాపకాలు తలచుకుంటేనే ఇప్పటికి, ఆ పుల్లటి కోత మామిడి కాయ పులుపూ తీపి కలిగిన రుచి తలచుకుంటేనే నోరూరుతుంది!
తోటలో ఆటలయ్యాక, అటునుంచి కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకుని, పాటిమీద దిబ్బ దగ్గరి రామేశ్వరాలయంలో, ఆంజనేయ స్వామి కుంకుమ పెట్టుకుని, శ్రీ రామచంద్ర పరివారం దర్శనం చేసుకుని, కొబ్బరి ముక్క తీర్థం కళ్ళకద్దుకుని ప్రసాదం స్వీకరించి పొలోమని ఇంటి దాకా పరుగు పరుగునా వచ్చి, మెట్ట తామరాకులో తోటమాలి ఇచ్చిన దొంతర మల్లెలూ, బొండు మల్లెలూ, సన్న జాజులూ, ఎర్ర మల్లెలూ, గులాబీలు, మరువం, చేమంతులూ తెచ్చి అత్తయ్యలకు కాని పిన్నులకు కాని ఇచ్చి, చేతులూ కాళ్ళూ మరలా బావిలోని చల్లని నీటితో, మార్గో సబ్బుతో హాయిగా కడుక్కుని, రిఫ్రెష్ అయి, పెద్దబాలశిక్ష, మిగతా పుస్తకాలూ పట్టుకుని ఆముదం దీపపు సెమ్మచుట్టూరా కూర్చుని
దీపం జ్యోతి నమఃస్తుభ్యం
దీపం జ్యోతి జనార్ధన।
దీపేనా హరతే పాపం
సంధ్యా దీపం నమోస్తుతే॥
అని మొదలు పెట్టి, ఒక అరగంట పాటు చదువుకునే వాళ్ళం. నాకేమో పన్నెండో ఎక్కం వస్తే మహా గొప్ప. మన ఇంట్లో పిల్లలందరికీ, ఇరవైయ్యో ఎక్కం ఇరవై ఇరవైలు వరకూ, ఆ తరవాత మళ్ళీ రివర్స్ ఆర్డర్లో కూడా నోటికే వచ్చేవి.
మొత్తానికి, సెలవులయ్యే వరకు కనీసం పదిహేనవ ఎక్కం పదిమార్ల వరకు బట్టీ పట్టీయం చేసి, కృష్ణాష్టకం, కృష్ణ శతకం దాశరథి శతకం, వేమన శతకం, సుమతీ శతకం, ఇంకా ఏవేవో వచ్చినంత వరకు బట్టీయం పట్టి, అమ్మయ్య సెలవలు దారి సెలవలు, మా దారి మేమూ వెళ్ళేవాళ్ళం పల్లె నుండి పట్టణానికి, సెలవంటూ..
ఇన్నాళ్ళయినా గుర్తొచ్చిన ఆ రోజులు ఇప్పటికీ నా రొటీన్ జీవితంలో వెలుగులు నింపుతాయి, ఆ భజనలలో, 'తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా’ అని పాడుకోవాలనిపిస్తుంది, మనసులో మీరంతా మెదిలితే ..
ఇప్పటికీ నీ పాటలు “లాలీ తనయా లాలీ సుందర నంద కుమారా జో సుందర నంద కుమారా"
“నిదురపో నవమల్లి నిదురపో సుకుమారి నిదురపోవే తల్లి నిదుర పోవే” పాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్నీ మరచి నిద్రలోకి జారుకుంటాను, మరీ హోంసిక్ అయినప్పుడు.. అప్పుడు నాకు శుభరాత్రి, నీకు శుభోదయం!
గుడ్నైట్ అమ్మమ్మా!
ప్రేమతో ఎప్పటికీ నీ ఉమా!
(ఉమడూ! తాటకీ! ఒసే!)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి