7, జులై 2022, గురువారం

ఆవకాయ జి. ఎస్. టి


🔴 ఎండాకాలం వచ్చిందంటే, పిల్లలతో పుస్తకాలు చదివించడం, వాళ్ళతో అక్కడికీ ఇక్కడికి తిరగడం, ఎప్పుడైనా ఏ నాసావో,  మెమోరియల్ పార్కో వెళ్ళడం, ఇత్యాదులతో సమ్మర్ ఎలా గడచిపోయేదో.

ఇండియాలోనైతే ఆవకాయలు, పెళ్ళిళ్ళు, ఏ జూవాలాజికల్ పార్కో అటెండ్ అవడంతో సరిపోయేది.
ఈ సంవత్సరం మాత్రం ఎండాకాలంలో ఎలా వేసవి ఎండలనుండి బయటపడాలో మళ్ళీ గర్జత్ బర్సత్ భీగత్ ఆయీలో అని మేఘమల్హార్ ఎప్పుడెప్పుడు వినవచ్చో అని  ఉవ్విళ్ళూరుతుంది మల్లెల తావిలో మత్తెక్కే మనసుకు..

ఆ ఉదయం, న్యూయార్క్ నుండి పొద్దునే కొడుకు, కోడలు పిలిచారు, చరవాణి అనబడే సెల్ఫోన్ లో.
“ అమ్మా,  శ్రావణి ఏదో అడుగుతుంది, చెప్పు.” సునీల్ ఫోన్ చేసి చెప్పాడు సుధామయి తో.
‘ఏమిటి శ్రావణి?’ అడిగింది సుధ.
‘ఏం లేదు ఆంటీ, ఇది మామిడికాయల సీజనేనా?’ అంది శ్రావణి.
‘కావచ్చు ఏమి?’ ఆశ్చర్యపోయి అంది సుధ,
“ఏంలేదాంటీ, ఈసారి మీ అబ్బాయి ఆవకాయ పెట్టమన్నారు. మీరైతే ఎక్కడ కొంటారు పచ్చడి మామిడికాయలను?’ అడిగింది శ్రావణి.
‘మీ అంకుల్ ప్రియా పిక్కిల్ కొంటారు, నేను గ్రోసరీ స్టోరు లో కొంటానమ్మా.’ అంది సుధామయి.
‘ఓహో, అయితే మరి సీజనెప్పుడు?’ శ్రావణి ప్రశ్నించింది.
‘ఏమో మరి, ఇంతకీ సీజనెప్పుడో ఈ దేశంలో…’

సుధ ఆలోచనల్లో పడింది.
సరే, తనుకూడా పచ్చళ్ళు పెట్టొచ్చు కదా ఈ వంకన, అని ఉత్సాహపడి, హైదరాబాద్ లోని చిన్ననాటి నేస్తం రమణిని అడగొచ్చు కదా అని తలపుకు వచ్చింది. అయినా, మళ్ళీ ఏవో పనులు తగిలి వారం రోజులు గడిచిపోయాయి. వారమైనా ఇంకా ఏ ఆవకాయల పనులూ కానే లేదా అని అబ్బాయిలు మళ్ళీ పిలవడంతో,
రమణిని అడుగుతే పోలేదా అని ఇండియాకి ఫోన్ చేద్దామనుకుని
వద్దులే, నిద్ర పోయారేమో అని వాట్సప్ టెక్స్ట్ పెట్టింది.

లాస్ట్ టైం, ఓన్లీ ఫైవ్ డాలర్స్ టైం లో కొన్నట్లు గుర్తు. ఒక ఇరవై ఏళ్ళకి పూర్వం.ఎట్సీ లో చూస్తే రేట్ చాలానే చెప్పాడు, దాదాపు $145.00 ఒక పది కిలో కి. మార్కెట్ ధరలు, 8 పౌండ్స్ కి $30.00 దాకా. 50 పౌండ్స్ కి 150 దాకా. పోనీలే అయినా సరే అని ఆర్డర్ చేద్దామంటే, సీజన్ ఓవర్. వెయిట్ ఫర్ నెక్స్ట్ సీజన్ అని మెస్సేజి.మరీ ఇదేమిటి అని రమణి ఫోన్ కోసం చూస్తూ ఉంది
 రమణి ఫోను మర్నాటికి గాని రాలేదు. ఏ పది గంటల రాత్రికో భారత కాలమానానికి ఫోను వచ్చే సరికి, ఆమె పని మధ్యలో ఉండి అందుకోలేకపోయింది.
‘అయ్యో, రమణి అక్కా,
కాల్ చేద్దామని ప్రయత్నం చేసాను, కలవలేదు, సారీయే’ అంది.
‘ఓకే, ఏమిటి సంగతి?’ రమణి అడిగింది.
“మామిడికాయలు ఇండియా నుండి అయితే, పుల్లగా, బావుంటాయి కదా’అంది సుధామయి. ‘సరే, నసుగుడు ఎందుకు, ఇప్పుడు దొరుకుతాయా లేదా కనుక్కోమంటున్నావు, అంతే కదా?’ రమణి అడిగింది,  అసలే ఆమె వెయ్యి పనుల్లో బిజీ…
మర్నాడు తిరిగి ఫోన్ చేసి అడిగింది సుధామయి, ‘రమణి అక్కా, ఏమిటి సంగతి ఏమైనా తెలిసిందా?’ అని.
‘ఓహ్ నేను కనుక్కన్నాను: లేవే ఇప్పట్లో, కొన్ని స్పెషల్ వెరైటీలు ఉన్నాయి. అన్ని డీటేల్స్ కనుక్కున్నారు బావగారు, వాటి ధరలు, వరసగా దసేరాలూ, సెందిరీలు, కొత్తకోట కొబ్బరి, సువర్ణరేఖ, నూర్జహాన్, లాల్ ఆమ్ వగైరాలు వస్తాయి ఇప్పుడు. ధర 95వేలు అంటున్నాడు మీ ఊరికి షిప్పింగ్ చేయాలంటే.’ అంది రమణి.

ఆశ్చర్యపోయింది సుధామయి.  ‘అదేమిటే, ఏదో చంద్రమండలం నుండి అన్నట్టు చెబుతున్నారు?’ అంది.
రమణి విసుక్కుని, ‘ఏం చెప్పాలి, వాడు, వాడి ఏజెంట్, వాడి కొరియర్ వాడు, వాటి పైన టాక్స్, వాటి పైన జి ఎస్ టి, 5% నుండి 28% దాకా ఒక్కొక్కళ్ళు వేస్తూ పోతున్నారు. కిలోకన్నా బరువుంటుంది ఒక్కో కాయ, వందల రూపాయలకు తక్కువలేవు, ఒక్కోటి. మరి ధరలు ఎంతుండాలి, నువ్వడిగినన్ని కాయలకి?
మరి నీదాకా రావాలంటే అవదూ మరి?’ అంది.
‘ఫరవాలేదు పంపించు’ అని సుధ అనబోతూ ఉండగానే,
‘అరె నీకెందుకు ఆలస్యం ఇంకా అని, అప్పుడే పంపించారులే, మీ బావగారు.’ అని ఎంతో భరోసాగా చెప్పింది రమణి.
‘ఓ అవునా చాలా థేంక్స్ నీకు చెప్పడం మరిచాను,
నీరావ, మెంతికాయ, అల్లపావ, కొబ్బరి, నువ్వులు, పెద్దావ, బెల్లం ఆవ, పెసరావ, మాగాయ, చెక్కుతొక్కు, వడగాయ ఓహ్ ఎన్ని పెట్టాలో! ఆవాలు, నువ్వులు, మెంతులు, అల్లంవెల్లుల్లి ముద్ద, పప్పునూనె, పల్లీనూనె, కుసుమలు, ఇంకా మసాలా ఆవకి షాజీర, లవంగ్, దాల్చిన, జావంత్రీ అవీ పంపించు’ చెప్పింది సుధామయి.

‘ఏమిటీ, చేరాయా ఆవకాయకి దినుసులు, కాయలు?’ అడిగింది రమణి పదిరోజులకి.
‘ఆ, వచ్చాయిలే.’ నీరసంగా అంది సుధామయి.
‘అదేమిటే? అంత నీరు కారుతూ నీరసంగా చెబుతున్నావు?’ ప్రశ్నించింది రమణి.
‘ఏం చెప్పను, మామిడికాయలు ఆ ఊరి నుండి, మా ఊరికి వచ్చేసరికి కొన్నేమో కుళ్ళిపోయాయి, మిగిలినవి కాస్తా పళ్ళయి పోయాయి, ఇంతదూరమూ, అవస్థ పడి, దేశదేశాలూ ప్రయాణం చేసి, 
జి ఎస్ టి వేసుకుంటూ వచ్చేసరికి. ఇంకా ఆవలేం పెట్టనూ?’ దీర్ఘం తీసింది సుధామయి.
‘అంతేలేవే, అయితే, నీకు వాడు కొరియర్ పంపిస్తే, వచ్చేసరికి ఫ్రెష్ గా ఉండవుగా మరి!’ వచ్చే నవ్వాపుకుంటూ, సముదాయించింది రమణి అక్క.
చెప్పొద్దూ,ముందుగా?చుర్రుమంది సుధ మనసులో, ప్రకాశంగా, ‘ఆ పోనీలే, శ్రమ తప్పింది’ అని ఊరుకుంది.

ఆ సాయంకాలం చందమామను చూస్తూ, ఆవకాయల కాలంలో అమ్మ అమ్మమ్మలు, వాళ్ళ హైరానా, హడావుడీ, తమ ఊరు, ఆ ఊరి ప్రక్కగా తోపు, ఆ కొత్తకోట కొబ్బరి మామిడికాయలు దశేరీలు, బంగినపల్లి కోత మామిడికాయలు, ఆ రోజులు తలచుకుంటూ, మామిడి తోరణాలు పండుగలు, కృష్ణశాస్త్రి గారి మధురమైన పాటలు, మల్లెల తావులు, మరచిపోకుమా తోటమాలి అని కూనిరాగాల్లాంటి కునేగా రాగాలు ఆలపిస్తూ, ఆవకాయల విరహం లో ఉండగా, శ్రీవారు చక్కగా ప్యాకేజీ విప్పుతున్నారు, మేడమ్, ఇన్ హ్యూస్టన్ బై ది గ్రేట్ ఐ ఐ టి రిటైర్డ్ ప్రొఫెషనల్ ఏలీట్స్ అన్నీ  అన్ పేక్ చేస్తున్నారు, "ఘుమఘుమలాడే ఆవకాయ, మల్లిక్ గారు టీం పెట్టింది"అంటూ నోరూరిస్తూ మిల్లెట్స్ రైస్ లోకి కలుపుతూ..ఆ రంగు, రుచి, వాసనలనాస్వాదిస్తూ, పదండి ముందుకు పదండి త్రోసుకు అని ట్యూన్, రాగం రచన మార్చేసి, మేము సైతం ఆవకాయలు ఆరబెట్టీ, ఊరబెట్టాము, అని లొట్టలేసుకుంటు… పళ్ళెం
సర్దుతున్నారు!

ఆవకాయ పళ్ళెం
ఇంగువ పొట్లం, కావేవీ కవితకనర్హం… భళా!

🔴🟡🟢

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి