13, జులై 2012, శుక్రవారం

చిన్న జీయరు సాములూ- మా సొద వినుండి మీరు

0 comments
ఏమి చెప్ప గలవారము చిన్న జీయరు స్వామీ?
తగునా మా బాస మీ బాసలన్ని తెలుప?
అ౦దాల మేడ అంట అద్దాల తలుపులంటా
తొమ్మిది దోరాల పొంటా రాను పోను దారులంటా

ఏమని చెప్పుదుము ఓ చిన్న జియ్యరు సాములూ?
నీలాల నింగి అంటా, నింగి వెంటా నీరంటా
జోరైనా గాలంటా, ఆకసాన మెరుపులంటా
అందని ఆకాసంలో నీరెట్లా నిలిచెనంటా?

ఏమని ఇవరింపగలము మా చిన్న జీయరు సాములూ!
ఎర్రాఎర్రని పూవంటా తూర్పున పొడిసెనంటా
రోజంతా నడిచి నడిచి పడమట కోనలకు బోవునంటా
ఎర్రాని పూవు వెంటా కమలాలు నవ్వునంటా

ఏమని అడిగేము మిము మా చిన్న జీయరు సాములూ!
ఆకలంటా, దాహమంటా ఆకులలములు దొరుకవంటా
తొమ్మిది నెలలు మోసి తాను మట్టిని మనిసి సేయునంటా
నీటిలోన మునిగే మడిసి అమ్మో! నీట నెట్టా బతికెనంటా?

ఏ విధి తలిచేము మిమ్ము ఓ చిన్న జీయరు స్వామీ!
దూరాన కొండలంటా, కొండలమీన దేవుండంట
దీనులను దానవులను ఒక్క తీరుగ బ్రోచునంటా
అడగకనే ఈడేర్చున౦టా, అడిగితే ఇంకేమనంటా!

ఎట్ట జెప్పమందురు ఓ చిన్న జీయరు స్వాములూ!
మెట్టినింట ఉన్నదంటా, తొల్త పంట కలిగెనంటా
నిండారా చూలాలంటా, కండా జవము లిచ్చెనంటా,
కన్నతల్లి సీతమ్మతల్లి అడవిపాలాయెనంట, అకటా!

ఏమని మిము పిలుతుము ఓ చిన్న జీయరు సాములూ!
మాపంటా రేపంటా పగలూ రేయి పబ్బమంటా,
చేతకాని వారమంటా జాతి మేలు తలవమంటా
మాయదారి మడుసులలో మతిలేదిదేమి తంటా?

ఏమని అడిగేము మిమ్ము ఓ చిన్న జీయరు సాములూ!
అలనాటి భూమి అంటా అంతా పంచుకున్నారంటా
పందెమాడ రమ్మని, ఉన్నదంతా వొల్చుకున్నారంటా
అంత సత్తా ఉండీ వారడవుల పాలయినారంటా

ఏమి చెప్పుకుందుమో చిన్న జీయరు సాములూ!
పంట చేల మందులంటా, పురుగులను దీసేస్తదంట
పురుగులు తోబాటే ఆరి పొలాల మట్టుబెట్టెనంట
పొలంగట్ల రైతన్నలు పురుగుల మందుతో పోయిరంట

ఏమి చెప్పమ౦దురు మా చిన జీయరు సాములూ!
పాములను చూస్తిమి, మడుసులను సూస్తిమింటా
పాముకున్న నియమాలు మడిసి మరిసి పోయెనంట
ఎన్ని సార్లు కాపాడెనో ఎంకటేసుడు మా వెన్న౦ట!

ఏమి చిత్రమో ఏమో మా చిన జీయరు సాములూ!
రాయంటా రత్నమంటా, రెంటి జూడ ఒకటే నంటా
సానపెట్టినంత గాని దాని ఇలువ తెలియదంటా
రాళ్ళల్ల రవ్వల వలె మెరిసె దొరా, తెలిసే దెట్లా?

ఏ ఇద్దెలు నేర్సుకోము మా చిన జీయరు సాములూ?
పెద్ద పెద్ద చదువులంటా పల్లెటూళ్ళ చేరెనంటా
ఉన్నోరికి లేనోరికి ఒక్కతీరు పాటాలంటా
పల్లెతల్లికి పనికొచ్చే తెలువులున్న మేలంటా

ఏ ఇసయం తెల్వాలే మా చిన జీయరు సాములూ?
బాసంటా ఊసులంటా, పనులంటా పనిముట్లంటా
చేతనైన వారికీ నెత్తికెక్కినంత సదూసందెలంటా
ఏతామేసే బడుగు మనిసికి మరి? నీ కాలు మొక్తా!


ఎంత చూసినా తీరదు చిన్న జీయరు స్వామీ!
నల్లాని మబ్బు వెంటా, తెల్లాని కొంగలంటా!
తెల్లాని కొంగల వెంటా, వీచే చిరుగాలి అంటా!
తెల్లారే దారి వెంటా, చిరుగాలికేల తొందరంటా!

ఏమి తెలుప మందురు ఓ చిన్న జీయరు స్వామీ!
అగాథమౌ గతం నుండి అగోచరమౌ భవిష్యత్తు
ఏదారెటు పోతుందో, ముందు గొయ్యి వెనుక నుయ్యి
మాపుచేసి ఈ కనికట్టు, సదా నడిపేది మీ చెయ్యి

ఎవరితొ మొరపెట్టుకోము చినజీయరు స్వామీ!
అన్నీ బాంధవ్యాలే అంతులేని ఆప్యాయతలె
అయినా ఈ మోసం ఈ దోసం దగా చేయు లోకం
ఎవరికెవరు లోకంలో ఈ అంధకార జగతిలో

ఏమని చెప్పుకోగలము చిన్న జీయరు స్వామీ!
పాతకాల నెన్నో చేసి పైకి శాంత మూర్తులం
ఇకనైనా ఓ దారి చూపి ఓదార్చు మహాత్ములు
మీరు దారి చూపకున్న మాకేది పాపనాశనం?

ఏమని వివరించగలము మా చినజీయరు స్వాములూ!
విదేశాల చదువులని దండిగ సంపద వచ్చునని
ఎండమావులకై వెంపర్లాడు మా మోడు జీవితం
మేపెడంత జీవన భారం మేయలేని అజ్ఞానులం!

ఎటుపోతున్నమో మేము ఓ చిన్న జీయరు స్వామీ!
ఆటు పోటులకు పడవ ఎటో కొట్టుకు పోతున్నది
గాడాంధకార బంధురమౌ ఏ కాళరాత్రో ఈ నిశి,
శరణు కోరితినిక మీరే దయతో తీరము చేర్చేరని!

ఏమని అందుము మా స్థితి ఓ చిన్న జీయరు స్వామీ!
పగలంతా పనులనీ కాకపోతె పనికిరాని కబుర్లనీ
రాత్రవగానే టివీ సీరియల్సు లేదా సినిమాలు
ఇంటిపని వంటపని ఇంతలోనె గుడ్ నయిటని!

ఎంతని విలపింతుము మేము, చిన్న జీయరు స్వామీ!
వదిలి వెళ్ళిన దశాబ్దానికి తిరిగి వచ్చినాము,
 వచ్చిన ప్రతిసారి ఎందరినో కోల్పోయినాము,
బంధుజనుల ఆత్మీయుల, నెందరెందరినో ఇలను

ఎంత తలచినా తీరదు ఓ గురువర్యా! చిన్న జీయరు స్వామీ!
వారిచ్చిన ప్రేమలు, మమతానురాగాలు, స్నేహ సౌశీల్యాలు,
సంస్కృతీ సౌరభాలు, సాహితీ సారస్వతాలు, చిన్ని చిన్ని
మాటలు, పాటలు, అంతులేని అభిమానాలు, దీవెనలు!

ఎంత పిచ్చివారము ఓ చిన్న జీయరు స్వామీ!
దేశమాత ఒడిదాటి ఉన్నత పాఠశాలలోన పట్టు
పట్టి పాఠ్యాంశాలను చదివి, పనికొరకు వెంపర్లాడు
బహు దిశలలో మేము, ఏ తీరున తీరునొ తపన

ఏమని ఓర్చుకుందుము చిన్న జీయరు స్వామీ
వేదాలూ భేదాలూ వేదాంతాలూ తెలియవు
రామాయణ భాగవతాదుల మీమాంసలు తెలియవు
బ్రతుకు బాటలోన చూచు బాధలేమొ వదలవు

ఏమని వివరింపగలము చిన్న జీయరు స్వామీ
కలయో కల్లయో కపటమో నిజమో  నిష్టూరమో,
దాహమో తాపమో, ఆకలో ఆతృతో, ఆర్ద్రతో
పాపమో పరిహారమో శరణు శ్రీరామ నామమొక్కటే

ఏమని వివరింపగలము చిన్న జీయరు స్వామీ, 
తెలుపగ వశమా మీ దయ హిమవన్నగమంతగా, 
దారి తెన్ను తెలియని మమ్ముధ్ధరించుటకు మీరు, 
పుణ్య ఫలములివ్వగ వేంచేసినారు, కర్మలు కడతేరగా

ఎంత తెలిపినా చాలదు మా ధన్యవాదములు స్వామీజీ!
జనమమెత్తి మరల మరల కూపస్థములవలె మేము!
మా జన్మను సార్ధకమొనర్ప వేంచేసినారు తమరు,
ఆచార్యా మీ తిరునక్షత్రం అత్యంత శుభదాయకం!
 
ఏమని రాయవలె ఈ వెతలను చిన్న జీయరు స్వామీ
మనుషులదే, మనసులవే, మాయమయమౌ లోకం
పాపం-పున్నెం తెలియని తమ్ముళ్ళు నావోళ్ళు
తల్లడిల్లకుండ కాపాడుమయ్య ఇవే మీకు వెయ్యి దండాలు

ఏట్ల చెప్పాలె మేము చిన్న జీయరు స్వామీ
కష్టమూ శ్రమా కావు కఠినమైనవి
నమ్మిన వాళ్ళే నమ్మకమును వమ్ము చేసినపుడు
అన్నినాళ్ళ సావాసం దేనికొచ్చినట్టు చెప్పరేమీ?

ఏతీరున బ్రోచెదరో చిన్న జీయరు సాములూ, 
చేతనైన నాడేమొ ఆట పాటలల్ల గడిపితిమి, 
పొద్దు పడమట మళ్ళే తలికి, తిరుగులేని సత్తేలు
మూడు కాళ్ళు ముందుకొచ్చె, కళ్ళు కానరావాయె! 

ఎటు దారి చూపుదరో మీరు, చిన్నజీయరు స్వాములూ,
కూపం వలెనే లాగుతున్న సంసారచక్రంలో జీవన యానం
వారం వారం కొలువైన రాముని ధ్యానమే  మరీచికయౌనే
మనుషులమనబడు మేము నిజముగ మనీషులమే, మేమే?

దాసోహాలు మీకు చిన్నజీయరు స్వాములూ
ఏ విధి గట్టెక్కగలమో మీ చల్లని దయ వినా
మా విధి నిర్వహణ ఎట్లున్నదో మీ కరుణా
మీ కృప యెల్లరకూ కొల్లలుండాల అడియేన్

తామసపు బ్రతుకులు మావి చిన్నజీయరు స్వామీ
సోమరితనం మూర్ఖత్వం అణువణువునా కలవు
కాపాడవె కరుణ తోడ త్రిగుణాలను సరిజేసి నీవు
కలనైనను నీ తిరుమంత్రం మరువనీకు గురుదేవా

అయ్యరో మా చిన్న జీయరుస్వామి మాకై వచ్చె
వెయ్యరో దరువెయ్యరో శాన్నాళ్ళాయెవారిని జూసి
కోయరో పంటచేలు కంకులన్ని కంటి నిండుగ నవ్వె
కాయరో మనుసులని, కట్టాలు బాప కైమోడ్స మీకె

అయ్యారె బల్ మన చిన్నజీయరు స్వామివోరు
కన్నతల్లి కన్న మిన్న మరల జలమ నిచ్చినారె
కొత్త కొత్త విద్దె లొసగి కొంగ్రొత్త నామ మిచ్చినారే
రైతుబిడ్డ రౌతు కొడుకు కడుపు సల్లంగుండాల

జెర చెప్పండ్రి ఎట్నో, బగమంతులు మా చిన్నజీయరు వోరూ
మాఘమాసం నెల నాళ్ళు, సంకురేతిరి సీకట్నే గోపెమ్మలంత
నల్లానల్లని యమునలోన మెల్లామల్లన గూడి తానాలనాడ
నల్లనయ్య, వెన్నదొంగా కోకలన్నీ మెల్లన దోచెనేల తెల్పరయ్య

ఒక్కరొక్కరు, అగో సూడండ్రి, చల్లని తండ్రి మా చిన్న జీయరు స్వామి వోరూ, గోపకాాంతలు చేతులెత్తి, దండం పెట్టి అడుగుతున్రు
అదిగో ఆ పచ్చచీర‌ అద్దకంతో నేసినాది, అది కాది, నాది నీలి సీర
నల్లనయ్యా నెమిలికంటిది, ఎర్ర రైకా తెల్లకోక ఇవ్వరో యని రోదిస్తూ

ఆ వంక జూడుండ్రి అయ్యా దేవా, చిన్న జీయరు స్వామీ
ఘనమైన కేశాలను వీపు నిండా జారవిడిచి అడుగుతుంది
ఆయమ్మి, గోపమ్మ తల్లిరో, కన్నయ్యా ఇదుగో నీకు అప్పుడే
తీసిన వెన్న పెట్టెదనంటా కటా కటా వొనుక్కుంట కట్ట సీరాలా నడిగే

ఏమి చెప్పుకోము స్వామీవోరు చిన్న జీయరు దయాళూ,
నగుకుంట నగుకుంటా గిట్ట నాలుగు మాటలే సెప్పిండ్రూ
నల్లానయ్యా గొల్లాభామల, నోములపంట నేను గాదాయనె,
పల్లరంగూ కేశాలను పైకంటా యని నెమిలిపింఛెం దోపుకోని

అంతలోనె అనదొడిగె ఎన్నో నీతులు, చిన్న జీయరు స్వామీ
జీవాతుమ పరమాతుమ దరిశెనమూ కలగ జేసె తేటతెల్లగ
మాయమాటలు కావమ్మీ మురళీ లోలుని వేయి మీటలు
వేణువు వాదనలో శరచ్చంద్రుడు కోటి వెలుగులు చిందించగ