18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఆవేదన కాదా?

0 comments
ఒక కంట కన్నీరు 
ఒక కంట కన్నీరు
కన్నీరు మున్నీరు

ఎత్తులూ జిత్తులూ
రంపాన కోసిరే
కన్నతల్లిని నేడు

రక్తతర్పణ చేసి
సాధించిరీనాడు 
శోకించిన నాడు 

శోధింతురేనాడు?
సాధించిరా నాడు? 

సాధించిరా మనదు
మానసమునందు
సంధ్యా వేళల నాడు
శోకాల నెన్నడూ 
అగుపించని నాడు??

ఏ నోట విన్ననూ
ఏ మాట విన్ననూ
కనిపించకుండునా కనుల
కాలవల లో కరుగు
తిమింగలాలతో తిరుగు
దు:ఖ భాండాలు, 
ముఖ ప్రీతి వచనాలు...

***.    ***.     *****

ఎందుకని నా కనులు
ఆగక వర్షిస్తున్నాయి?

తెలుగు తల్లికిపుడిద్దరు
అల్లారు ముద్దుబిడ్డలని
హృదయానికి నచ్చజెప్పి
ఆనందించాలనే ఉంది,

ఆ అందమైన తల్లి రెక్కలు
విరిచి, విహంగాలతో ఎగరమంటే
ఎగరేందుకు శక్తి లేక యాతన పడుతుంటే
ఏమని ఆనందము తెలియగలను? తెలుప గలను?

భాషేదైనా, భావన ముఖ్యం,
అమ్మ కు బిడ్డకు తీరేదా 
పాలిచ్చిన ఋణానుబంధం? 
పేగుల్లో దాచి సాకిన
మనిక ఋణం తీర్చేదా?

ఏ జన్మయినా, అమ్మా నీవే నా తల్లివి
నీ తీయని పాల మధురిమ
ఇంకా నా నాలికపై ఆడుతుంది 
ఏండ్లు పూండ్లు దాటిపోతే
పంతాలకు, పట్టింపులకుబోతె
తీరునా అమ్మా, నిను కనని
ఆవేదన?

ఆది నుండి నీవే కదే
ముగ్గురమ్మల యమ్మవు,
శ్రీ లలితా, శుభదాయిని
మాటలతో మమత పంచు 
మహిమాన్విత మల్లెపూల తెలుగు తల్లి,
మమ్మందరనూ గాచే కడుపు చల్లని
బతుకమ్మ తల్లి, నేడే మీ నీడలో
తలంటుకునే శుభదినం,
హారతులందుకొనవమ్మా
మా కన్నతల్లి నీవు..
ముగ్గురమ్మల యమ్మా
జయము నీకు కన్నతల్లి
జయము జయము జయమే!
జయము పలికేమే 
మాతృభాషా శుభ దినమున!