27, జనవరి 2015, మంగళవారం

వడగాల్పులు- వాడే బ్రతుకులు

0 comments
ఈ గ్రీష్మం కోరలు చాచి
కాలుస్తోంది ఉగ్ర తాండవం తో
శీతల వాయుజనకాలు లేవు
నివాస యోగ్యము కాని నీడలు తప్ప
పైన ఫంకా కూడా లేదు, ఆ
ముదుసలి పేదరాలు, పాట్లు
పడుతూ, నేల ఊడ్చుకుని,
ద్వారం తెరిచి ఉంచింది
చల్ల గాలి ఏమైనా ఒస్తుందేమోనని ఆశతొ
మల్లెల మకరందాలు, పిల్లగాలి పై తేలి వచ్చే
వేణువు నాదాలు లేవు, నిశ్శబ్దం గా పైకి
వచ్చే పెను ప్రాయపు ఈతి బాధలు తప్ప
కోకిల కలకూజితాలు వినపడవు, టపటపలాడుతూ
ఎగిరి వచ్చే ఎండుటాకులూ, చిత్తు కాగితాలు తప్ప
సూర్యుడు పశ్చిమాన కృంగి పోతే
గాలి చొరబడని గతుకుల బ్రతుకులో
ఒక దీపం వెలిగించాలని, చీకటి చీల్చుకు
వచ్చే వెలుగు కిరణం కోసం,
ఆ సాయంకాలం, చిన్న నూనె దీపం వెలిగిస్తుంది,
ఎటువెళ్ళిందో మధ్యాహ్నం అగడు పుట్టించిన
ఎర్రని ఎండ, ఎక్కడినుంచో వీస్తున్న వడగాలికి
చేయడ్డు పెట్టి, వెలిగిస్తుంది చిన్న దీపపు వత్తి