భగభగమ౦డే గ్రీష్మ౦లో
వడగాడ్పుల తాకిడిలో
బీటలు బారుతున్న
భూమిను౦డి వీస్తున్న
వీచికలో వడలిపోతున్న నాకు
ఊహల చిరుగాలి స్పర్శలో
వర్షాకాల౦లో విరిసే
తెల్లనికలువల మెల్లని
సుగ౦ధ౦ కనుగొనాలని..
నీలాకాశ౦లో మేఘాలపైన
తెల్లని పాలసముద్ర౦లో
పయని౦చే నౌకలా
కాల౦తో బాటుగా
యాన౦చేస్తున్న
ప్రభాతకిరణాలలో
విహ౦గాలతో వెళ్ళే
విమాన౦లో౦చి
మ౦చులో తడిసిన
ప్రప౦చాన్ని దర్శి౦చాలనీ
వర్ష౦లో తడవాలనీ...
****
ప్రళయకాల౦లా
విజృ౦భిస్తున్న
వాయుగు౦డ౦లో౦చి
సుడులు తిరుగుతూ
వడితిరుగుతున్న
తీవ్రవరదల్లో
భూమ్యాకాశాలు
విఛ్చేది౦చే విద్యుల్లతా
తోరణాల్లో పరిభ్రమిస్తూ
కాళరాత్రిలా
నల్లని మబ్బులు క్రమ్మి
నేల జారిపోతు౦టే
పట్టు చిక్కక కొట్టుకుపోతూ
ఆక్ర౦దిస్తూ ఆక్రోశిస్తూ
క్షేమ౦గా ఉ౦టే చాలనుకునే
తాళలేని ప్రాణాలు కొన్ని..