8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మనోకాంక్ష

0 comments

రావాలని ఎంతో ఉంది
కన్నుల పండువగా
కావ్య గానం చేస్తూన్న
నవీన కవయిత్రుల
ఓంకార కలరవాలు
కుహుకూజితాలే కాదు
కాళ రాత్రుల్లో పొంచి
ఉన్న నర మృగాలను
ఘీంకారనాదం నినదిస్తూ
తృష్ణతో, ఉష్ఠ్రం లా పైబడ్డ
నికృష్టుల వృషణాలు
కర్తరీకృతుల జేసి, నిర్వీర్య,
నియమశూన్యులను
వీతవీర్యులను చేయగల
సాటిలేని నేటి మేటి
వీర వనితలను పలకరించాలని
పరిగెడుతున్న జీవనధారలో
ఒక క్షణం సమాజ స్పృహతో
కవిత్వానికి నియమించిన
చిన్నారులనుండి, అసమాన
అనసూయ మాత వరకూ
గగన సుమాలను, గరళకంఠుని
మెడలోని నాగమణిని సరళంగా
ధరించే జంగమ దేవుని అర్థాంగిని
ఒసగే ధైర్య, స్థైర్య, ధృతి, స్మృతి,
స్ఫూర్తి అందరికీ కలగాలని
అభినందనలనందిస్తూ
ఈసారికి ఇలా ముగిస్తున్నాను!