21, అక్టోబర్ 2013, సోమవారం

భావన

0 comments
నేను నీ భావనలోనే
తేలిపోతాను
నీ ఊహల ఊయలలోనే
గూడు కట్టుకుంటాను
నీ మాటల పల్లకీలో
ఏడేడు సముద్రాలు దాటతాను
నీకై ప్రపంచాన్నే వీడి 
నడచి వచ్చాను
నీ నోట నా పిలుపుకై
యుగాలు వేచి నీలో ఐక్యం ఔతాను
కృష్ణా నీ మోవి పై చిందు
ధరహాస రేఖలా అవి?
నా ఊపిరి కి ఆలంబన నిచ్చే
రాగాల మాలికలు, 
వెన్నెలలో విరిసిన పారిజాతాలు! 

నీ శ్వాసలో

0 comments

నీ హృదయం లో వెల్లివిరియు భావననై
నీ ప్రణయం లో తాదాత్మ్యతనొందు అనురాగమునై
నీ కలలలోన నిండిపోవు రాగమయినై
ఆ రాగాలను రసమయం చేయు కాదంబరినై 
కృష్ణా నీ మురళిలోన రవళించే నీ నిశ్శ్వాసనై 
రగలి, పొగలి సెగలూరక నీలో నిలిచే చైతన్యాన్నై 
శారద నీరద యామినిలో పొగమంచు నిండిన నదిలో
అలలపైన సాగిపోవు కలువల నావలో
కావ్యగానము చేసే కలువకనుల సహచరినై
సాగనీ నీతో నా జీవనం, ఇలాగే సదా నీ అనురాగ హృదయ నాదమై,  
నీ ప్రణయినై, ప్రణవమై, నీ రమణీయ జీవన సహచరినై..