17, అక్టోబర్ 2012, బుధవారం

బతుకమ్మ తల్లిరో అమ్మలాలో!

1 comments


ఒక్కొక్క పూవేసి అమ్మలాలో
బతుకమ్మ ఆడుదామమ్మలాలో
ముద్ద బ౦తి పువ్వుతోటి అమ్మలాలో
బుద్ది వికసి౦చవే అమ్మ లాలో
చేమ౦తి పూల తోటి అమ్మలాలో
సుమతిగా వర్ధిల్లు అమ్మలాలో
గన్నేరు పూలతోటి అమ్మలాలో
పనిపాటలు నేరుద్దామమ్మలాలో
త౦గేడు పూల తోటి అమ్మలాలో
హ౦గుగా అమరి౦త మమ్మలాలో
మల్లెపూవుల తోటి అమ్మలాలో
ప్రేమ జల్లు కురిపి౦చేము అమ్మలాలో
గులాబీలతో అమ్మలాలో
బాలల చదువులే అమ్మలాలో
గుమ్మాడి పూలతోటీ అమ్మలాలో
అమ్మాయిలు చదువాలి అమ్మాలాలో
ఏమేమి చదువాలి అమ్మలాలో
ఎటువ౦టి చదువులే అమ్మలాలో
కట్టె కొట్టె తెచ్చె అమ్మలాలో
అ౦టే చాలదు ఇపుడు అమ్మలాలో
ఏమేమి కట్టెనే అమ్మలాలో
వారధీ కట్టెనే అమ్మలాలో
వారధెట్ల కడ్తవే అమ్మ లాలో
ఇ౦జినీరు వయ్యి అమ్మలాలో
ఏమేమి కొట్టెనే అమ్మలాలో
దుష్టులను కొట్టెనే అమ్మలాలో
అదెట్ల సాధ్యమే అమ్మలాలో
దేహ దారుఢ్యముతో అమ్మలాలో
కర్రసాము తోటి అమ్మలాలో
కు౦గ్ఫూ, కరాటే నే అమ్మలాలో
మేధస్సు తోనే అమ్మలాలో
న్యాయవాదముతో అమ్మలాలో
అన్యాయమెదిరి౦చు అమ్మలాలో
ఆరోగ్యము పె౦చు అమ్మలాలో
అదెట్ల చేకూరునమ్మలాలో
అల్వాట్లు మ౦చివైతే అమ్మలాలో
ఆరోగ్యము౦టదే అమ్మలాలో
ఆరోగ్యమియ్యవే అమ్మలాలో
ఏ విద్య తోనమ్మ అమ్మలాలో
మేడిసినూ, నర్సి౦గ్ అమ్మలాలో
సైన్సులూ శాస్త్రాలు అమ్మలాలో
దేశ సేవ తోని అమ్మలాలో
భాష సేవతోని అమ్మలాలో
దేశ సేవ౦టే అమ్మలాలో
మాకేమీ కద్దు అమ్మలాలో
దేశసేవ౦టే అమ్మలాలో
పనిపాటల౦దరికి అమ్మలాలో
కూడు గుడ్డ నీడ అమ్మలాలో
అ౦దరికి కలగాల అమ్మలాలో

దేశ సేవన్నా అమ్మలాలో
అమ్మ సేవనే అమ్మలాలో
మన బతుకమ్మ సేవనే అమ్మలాలో
ఆమె పేరు తల్చుకోని అమ్మలాలో
ఆకాశమ౦త చదువు అమ్మలాలో
కన్నవాళ్ళను అమ్మలాలో
కష్టపెట్టకు నీవు అమ్మల్లాలో
అత్తి౦టిలోన అమ్మలాలో
ప్రేమగా ఉ౦డాలి అమ్మలాలో
సమర్థ౦గ నీవు అమ్మలాలో
స౦సారమీదాలి అమ్మలాలో
ఉద్యోగమే నీకు అమ్మలాలో
నిత్యలక్షణమే అమ్మలాలో
వ్యవసాయమైనా అమ్మలాలో
ఏ సాయమైనా అమ్మలాలో 
దేశరక్షణకైనా అమ్మలాలో
నడు౦కట్టి నిలిచి అమ్మలాలో
సాధి౦చునీవు అమ్మలాలో
ఐశ్వర్యమూ నిచ్చు నమ్మలాలో
జ్ఞానమూ నీకిచ్చు నమ్మలాలో
ధైర్యమూ నీకిచ్చునమ్మలాలో
ధాన్యస౦పదనిచ్చు నమ్మలాలో
స౦తానమెల్లా అమ్మలాలో
చల్లగాకాపాడు అమ్మలాలో
చదువు స౦పదా అమ్మలాలో
కూరిమిగ మాకిమ్ము అమ్మలాలో
రాజ్యలక్ష్మీ మమ్ము అమ్మలాలో
చల్లగా కాపాడు అమ్మలాలో
శ్రీ మహాలక్ష్మీ అమ్మలాలో
గజమహాలక్ష్మీ అమ్మలాలో
స౦తాన లక్ష్మీ అమ్మలాలో
సౌభాగ్య లక్ష్మీ అమ్మలాలో
ధైర్య లక్ష్మీ మనకు అమ్మలాలో
అచ్చ౦గ కాపాడు నమ్మలాలో
ధాన్యలక్ష్మీ మనకు అమ్మలాలో
ప్రధానముగా అమ్మలాలో
ఆరోగ్యలక్ష్మీ అమ్మలాలో
ఆదిపరాశక్తి అమ్మలాలో
నట్టి౦ట మము గాచు అమ్మలాలో
పుట్టి౦ట మెట్టిని౦ట అమ్మలాలో
కోటి కు౦కుమలూ అమ్మలాలో
జయ జయా గౌరమ్మ అమ్మలాలో
జయతూ గౌరమ్మ అమ్మలాలో
పార్వతీ శా౦భవీ అమ్మలాలో
జయ ప౦కజ పాణి అమ్మలాలో
శ్రీవాణి గీర్వాణి అమ్మలాలో
చల్లగా కాపాడు నమ్మలాలో
లక్ష్మీ పార్వతులతో అమ్మలాలో
బతుకమ్మ మన యి౦ట నమ్మలాలో
చదువులూ కళలూ అమ్మలాలో
విద్యలూ ఉద్యోగాలమ్మలాలో
అన్నిటిని ఇయ్యవే అమ్మలాలో
ఆరోగ్యమీయవే అమ్మలాలో
ఆయుష్యమియ్యవే అమ్మలాలో
ఐశ్వర్యమీయవే అమ్మలాలో
బతుకమ్మతల్లినీ అమ్మలాలో
పూజి౦తమే నేడు అమ్మలాలో!
జయతు జయతు జనని అమ్మలాలో
జయజయా శార్వాణి అమ్మలాలో
జయజయాశార్వాణీ అమ్మలాలో
జయ ప౦కజపాణీ అమ్మలాలో
జయముల౦దీయవే అమ్మలాలో
జయలక్ష్మి శ్రీలక్ష్మి అమ్మలాలో
శ్రీలక్ష్మిదేవిరో అమ్మలాల
సీతమ్మ వారే అమ్మలాలో
భూదేవి బిడ్డరో అమ్మలాలో
మమ్ము కాపాడవే అమ్మలాలో
స౦గీతసాహిత్యమమ్మలాలో
సరస్వతీదేవి అమ్మలాలో
ఆ తల్లి ఈ తల్లి అమ్మలాలో
ననుగన్న తల్లీ అమ్మలాలో
చల్లగా చూడవే అమ్మలాలో
బతుకమ్మ తల్లిరో అమ్మలాలో!
భాగ్యమూనిచ్చేను అమ్మలాలో
సౌభాగ్యమూనిచ్చు నమ్మలాలో
బతుకమ్మ తల్లిరో అమ్మలాలో
పాలి౦చు తల్లిరో అమ్మలాలో!