19, సెప్టెంబర్ 2022, సోమవారం

సుగమమౌగాక సతతము యుగయుగాలకు

0 comments

కనులలో నిలుపుకొనుము

నా ఊసులను

దాచుకొనుము హృదిలోన

నా ఊహలను

కాను నేను కవితాస్మృతికి

అర్హము

కదిలి జాలువారనీకుము

నీమనసున నా గురుతులేవియు

ఆవిరైపోవనీ అనంత నిశీథిలోన

ఏవేని నా తలపుల శీతోష్ణ తాపాలు

కురవనీ గగనాంచలముల నుండి

ప్రేమపరిమళజల్లులు

ధారలై మధుర మురళీ రసాస్వానమై

గూటిలోని గువ్వవలె దాచుకొనుము 

నీ మనసున నాపైని ద్వైవీ భావనలు

కాను నేను ఋషిని,

కాను మీ కృషికి అర్హురాల

మీ జీవనసరళిలో

ధారలైసాగు జీవనదిలో

ఎక్కడో కొట్టుకుపోవు

ధూళిప్రోవును

మీ సుమనస్సుల ఖేదమొనరించి

ఇంకను మరింతగా భారమైతిని

భువికిని బుధజనులకును నా ఉనికితోడ

క్షమాధరిత్రిన, మీమనంబుల

ఇంచుక కనికరమున్న

మీ కమలేక్షణముల సుంత దయయున్న

అర్థించెద నను గుర్తించకుమని

మరచిపొమ్ము అవలేశమైన

మీ మనముల మలినపరచకుము

కరగిపోయెదనొక దినము

గాలిలో ధూళి వలె

మరచిపొండు, మది తేటగా

పొదవి ఉండనిండు

మేకపెంటిక మెండు

నాకన్న, నా ఉనికి కన్న

ప్రాణమున్నంత మేర

కాయము పడి ఉండనిండు..

ఎచటనో పంకిలమును

ప్రోగుపడిన కమలదళాలవె

నా చిగురుటూహల

పల్లవించనీయుడు

భక్తితోడ మీ యెల్లరి

చరణములకు చేయు నా

మూర్థనములు స్వికరించి

భాసించనీ మీకీర్తి

పలుదిసలు

కన్నలనిండుగ దినదినము

రామానుజ కటాక్ష వీక్షణములు

కనకవర్షము కురిపించనీ ఇహమునందు

ప్రార్థించెద అందరి కుశలమునకై

ఇహపరములందు చెందుడు

గురు కృపాకటాక్షములను

సాధించగ మీ జీవన ధ్యేయమెల్లరును