నీలాకాశంలో మబ్బుల వలె
ఆలోచనల అలల కలల అలలు
కదులుతున్న కాలప్రవాహంలో
ఆటుపోటుల రచ్చబండల తాకిడికి
దూది పింజలై నింగికి ఎగిసిపోతే
నిస్సత్తువతో నిర్వేదనతో నిరాశతో
నవకమల హృదయాంతరాళాలలో
ఉప్పొంగే భావోద్వేగాలు, శిలలై
ఘనీభవించిన హిమ శకలాలై
నీరసించిన రసోద్వేగాలై, కల్లోల
భరిత కావ్యాంతర తరంగాలై
మనసున, ఇంకా ఏదో మిగిలి
గుండె గోడలపై నిండిపోయి
ఎండిపోయి ఉండిపోయిందేమో
కానుగ శిలాజాల ధూళి వలె
అన్నటుల, ఉదయాన్నే పొడచూపే
రవికిరణాలతో బాటుగా, పొడి పొడి
మాటలతో, శూలాలై దిగిపోయే
నిజానిజాల ఖనిజాల హేళనాభరిత
వాక్బాణాల క్షాళనారహిత మేధస్సులతో
మనిషిని నిర్దేశించే మనుష్యులమైనామని
విర్రవీగే, మదమెక్కిన గోమేధిక నేత్రాలతో
తన బింబం తానే కనలేని
క్రుద్ధ నయనాలగురువిందలు,
కడగారే కన్నీళ్ళ అడుగున,
ఇంకి, గ్రుంకిన జీవితాలను
ఏరిపారేసి మానవత్వ మహిత
మనలేక, శ్రీమన్నారాయణుని
నామం వినలేక, ఆ పంచాయుధ
మురళీధరుని తేజోమయ విరాట్రూపం
కనలేక, కళ్ళు బైర్లు కమ్మిన
కుళ్ళు మనస్తత్వాలను తోడు తీసుకుని
ఉడాయించిన పెద్దరికపు కృద్ధులను:
కాలం అంతా నాసిరకం నాజీల వలె,
దురాగతాలలో త్రేలిన ఆగంతకులను,
దిగంతాల కవతల, పెను తుఫానులో
కొట్టుకుపోయి అట్టాడి పోయేలాగ
అత్యద్భుత రూపంతో అవతరించి,
ఆవలకు పంపిన నామం
నా మది నిండే, మదిన వెలిగే
శ్రీ రామనామం, కరుణించి
శరణొసగే రఘుకులతిలకం,
కాదంటే, కనపడలేదా, భగభగ
మని వెలుగుతూ, కుటిల మనసుల
అంధకారం పారద్రోలే రామబాణం?