9, మే 2022, సోమవారం

ఎందని కానను?

0 comments
🔴ఓ కారుణ్య పయోనిధీ!
ఎవరన్నారు నువ్వు రావని?

మనసు లోని పొరల లోతుగా
చీల్చుకు వచ్చిన ప్రతి పిలుపూ 
నింగి నేలలు ఏకం చేస్తూ
దిగంతాలకవతల ఉన్నా
నీ సన్నిధాన వరమిస్తుందని 
నీ సన్నిధికే చేరుస్తుందని,

ఎరుకవు నీవని, ఏలిక నీవని 
కానరాని చీకటిలో కూడా
వెన్నెల నీవని, వెలుగువు నీవని
మస్తిష్కంలో పొరల్లో దాగిన
విషయాన్నంతా విశదిస్తావని, 

ఊహామాత్రంగానైనా నీ ఉనికిని
తలిస్తే, మనసులోన మెసల్తే
అది నీవే, నీవే, నీ కృపయేనని!

కరడు గట్టిన శిలలైనా సరే,
విరులు చిందు నీరుబికించేవని
తరుల సిరుల పూయించెదవని, 
పదము పదము, పలికించేవని
సహృదయ శీలత చిందించేవని

విన్నాను, కనుగొన్నారని 
కనుగొన్నారనే తలచాను

పూవులలో, తావిలో, తేనియలలో, మల్లియలలో
మకరందంలో, అందంలో 
లలిత లలిత పద భావనలలో
నాట్యంలో, గానంలో, పరుగులు
తీసే బాల్యంలో, యవ్వనపు
పరుగులలో, నీ నామంలో
నీ ధ్యానం లో, నీవు చెంతనే 
ఉన్నావనే భావనలో 

నీ భావనల వెల్లువలో
భావములో, తాదాత్మ్యత లో…
నీలోని వినీలాకాశపుటంచులలో
ఆవల, పెనుజీకటికావల, 
పరిమళాలు వెదజల్లే 
నీ స్నేహంలో, నీ పెదవి పైన
రవళించే మోహనరాగంలో
ఎనలేని సమస్త బ్రహ్మాండంలో
కంటికి కనిపించే,  కానరాని
సముదిత లీలామానస లోకంలో

నీ తలపులో నా పిలుపులో
కలలలో కలబోసిన వలపులో
కలవు
కల వు
కలవు!
🟢