22, జనవరి 2012, ఆదివారం

పాప- పంతులమ్మ

0 comments
"విజయ్, నువ్వు చెప్పు నీకేం గుర్తున్నాయో ఇండియా సంగతులు?" బాటిల్ లోంచి
సింగిల్ మాల్ట్ స్కాచ్ సెర్వ్ చేస్తూ అడుగుతున్నాడు సుందర్. "ఎన్నో గుర్తున్నాయి, ఏవి చెప్పమంటావు?" విజయ్ ప్రశ్ని౦చాడు. "ఏవో ఎందుకు, మీ ఊరి ముచ్చట్లే చెప్పు, ఆకాశం తేటగా ఉంది, ఇంకా మబ్బులు పట్ట లేదు, రాత్రంతా వినచ్చు, ఏం ఫరవా లేదు" అన్నాడు వినయ్ నెమ్మది గా మంద్రంగా గంభీరంగా వినిపించే సినారే గజల్ల్స్ వింటూ.
"అయితే సరే, వినండి" అంటూ మొదలుపెట్టాడు విజయ్. నీలి పరదాల అవతల కనపడూతున్న జాబిలిని చూస్తూ, "కొందరి జీవితాలు ఇలా కూడా ఉంటాయి, మట్టి లో పుట్టి మంటి లో కలుస్తూ.. మధ్య లొ ఎక్కడినుంచో ఎప్పుడో, వసంతం వస్తుంది, పూలు వికసించాలని. ఎవరో కొందరికి మాత్రం అదృష్టం కొద్దీ అది నిజమౌతుంది" విజయ్ కథ చెబుతున్నాడు..
* * * * *

శారదా స్కూల్ లో పిల్లలు ప్రేయర్ చదువుతున్నారు, "హే జగ్ దాతా విశ్వ విధాతా, హే సుఖ్ శాంతి నికేతన్ హే".
లైనులో ఒక పొసీషన్ ఖాళీ గ ఉంది, అది పాపది. మూడు రోజుల్నుండి పాప బడికి రాలేదు.
పాప వాళ్ళ నాన్న రోజూ సైకిల్ పై తీసుకొచ్చే వాడు, ఎందుకనో గత మూడు రో జులుగా రావటం లేదు.
పాప తండ్రి ఒక మామూలు వర్కర్, అందుకే పాపను బాగా చదివించాలని ఆశయం.
పాప పేరే పాప. గంగన్నకు పెళ్ళయిన ఏడాదికే పాపను ప్రసవించి, కాన్పు కష్టమై భార్య కనుమూసింది.
అప్పటి నుండీ గంగన్ననే పాపను చూసుకుంటూ పనులు చేసిపెట్టేవాడు భాయి ఇంట్లో.
పాప వాళ్ళ టీచర్ శారదకి పాప అంటే ఎంతో ముచ్చట, పాఠం చెప్పగానే వల్లిస్తుందనీ, ఉచ్చారణ చాలా స్వచ్చంగా ఉంటుందనీ. శారద మనసులో ఆలొచనలు తొలుస్తున్నాయి, "ఏమయ్యుంటుంది, పాప ఎందుకు రాలేదో". ఇక ఉండలేక కనుక్కుందామని గంగన్న పని చేసే ఇంటికి ఫోన్ చేసింది.
వాళ్ళు కూడా గంగన్న కనిపించక రెండు రోజులైనా అయి ఉండొచ్చు, మరి వస్తే కనుక్కుంటామని చెప్పారు.
సరేనని మిగతా పిల్లలకు క్లాస్ కండక్ట్ చేసింది శారదా టీచర్.
శారదా టీచర్ ఆ కాలనీ లో ఉండే వర్కర్లందరికీ సహాయం చేస్తుంది.
పిల్లలకి చదువు, ఆడవాళ్ళకి వృత్తి విద్యలూ, రాత్రి పెద్దవాళ్ళ బడీ కండక్ట్ చేస్తుంది.
శారదగారితో బాటు చాల మంది కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు వాలంటీర్లుగా టీచ్ చేస్తారు.

ఆ బడి దగ్గరే, మున్సిపల్ కాలనీ, మలక్ పేట మధ్య లో, గిర్నీ పక్కన ఒక చిన్నకార్నర్ టీస్టాల్ అది.
ఓ మూల ఒక బల్ల వద్ద కుర్చీల్లో నలుగురు కబుర్లు చెబుతూ మట్లాడు తున్నారు వేరే ఎవరి గురుంచో.
”ఆడసలే కర్కోటకుడసె’ దూరంగా కూర్చుని, సాసర్ లో చాయ తోబాటు బిస్కోట్టీ లు నముల్తూ అంటున్నాడు రాములు.
’ఎవర్నీ, అంకయ్యనా?’ బీడీ కాలుస్తూ, తుపుక్కున పక్కన ఊసి, తల పాగా గట్టిగా చుట్టి నిలబడ్డాడు ఇక వెళ్ళాలని సైదులు.
" ఔనన్నా, ఆని కోసరం పొద్దుటి సంది ఎవరో భాయి మనుషులు తలాష్ జేస్తన్రు. ఓ సైదులు అన్నా, ఉండెహే, యాడికి లేస్తాండవు? జెర్రాగిపో, నానూ అస్తున్న" రాములు సైదుల్తో అన్నాడు, టీకొట్టు వాడికి బకాయి పైసలు కడుతూ.
"అవు గాని, గియ్యాలె, గింత పొద్దు పోయిందానుక పన్లెకు బోలే? పానం బాగుంది గద ఇంటోండ్లకు?"
"ఆ బాగనే ఉంది కాని, గా డాక్టరమ్మ తానికి బొయి౦ది మా యామె, ఏందో పరేశాని దానికి గడియ కోసారి.
సంటిది పండుకున్నది జూసి బయట బడ్డ ఒక్క నిమిశం, పక్కింటి పోరికి జెర్ర జూడమని జెప్పి"
’గట్లనా?’ అని ఆదెయ్య అడిగాడు. "అవు గాని గంగన్న కానొస్తలేడీమద్దెన, అంత బాగేనా?"
"ఏమో మరి రోజు బిడ్డెను దీస్కొస్తుండే, రెండు రోజుల తాన్నించి పత్తా లేడు, ఊళ్ళుండొ, ఏడికన్న బాయెనో మరి, తెల్వది". అన్నాడు రాములు.
ముగ్గురూ కలిసి బయల్దేరారు పనుల్లోకి.
సైదులు బియ్యం బస్తాలు మోస్తాడు, చేతనైన సాయం పక్కవాళ్ళకు చేస్తాడు.
రాములు కన్స్ట్రక్షన్ వర్కర్, పక్కనే ఉన్న దారిని పేవ్ చేస్తున్నారు కంపెనీ వాళ్లు.
ఇద్దరూ కబుర్లు చెప్పుకు౦టూ నడుస్తున్నారు. "గంగన్న మంచోడే గాని, మొదలు గా భాయి దగ్గర పనికి కుదిరిి నుండే. ఎన్నడు కత్తి బట్టి ఎవ్వణ్ణి ఒక్క దెబ్బేసి౦ది లేదు.
అసుంటోణ్ణి భాయి చెయ్యి తిర్గెటట్టు పన్ల బెట్టిండు. అయినా గుడా వాడు ఎన్నడొక్కణ్ణి సంప లే."
"ఆనిపరేశాని ఆనిదే నన్న" అన్నాడు సైదులు. "ఏమంటే, పైసల్తాన అందరొక్కతీరే భాయికి"
"అగో, అది అందర్కి తెల్సిందే గదనే, ఇయ్యాలెమో కొత్తగ జెప్పవడ్తివి?"రాములు అన్నాడు.

"గంగన్న సిన్నప్పుడే అయ్య పోయిండు, ఆని తాగుడుకే ఆని సంపాదనంతా పోయేది, సివర్నరోగమొచ్చి ముంచిందాణ్ణి.
ఇగ, తల్లుండే, ముగ్గురు తమ్ములు, ఇద్దరు సెల్లెండ్లు. ఆల్లని పయికి తేనీకి, ఈ గంగన్న పట్నానికొచ్చి, ఆళ్ళ నీళ్ళనడిగి కూలి నాలి చేసి తల్లికి పైసలు పంపుతుండె. .." సైదులు మాట్లాడ్తూండగానే వాడి సరుకుల కొట్టు వచ్చేసింది.
"మంచిది తమ్మీ, మల్ల గలుత్తాం" అని ఆదెయ్యతో కూడా చెప్పి, సైదులు వెళ్ళి పోయాడు.

ఆరోజు కాంక్రీట్ వేస్తున్నారు, రోడ్ రోలర్ల గోల, తట్ట లతొ కాంక్రీట్ వేసేవాళ్ళూ, మిగతా కూలీలందరూ హడావిడిగా పనిచేస్తూ ఒక రక మయిన చేతనంతో వాతావరణం నిండిఉంది.
పక్కనే ట్రాఫిక్ తో ఇంకా రద్దీ గా ఉంది ఆ బ్లాక్ అంతా. దానికి తోడు బియ్యం లారీల వాళ్ళూ, కూరల ట్రక్కులూ, త్రీవీలర్ ఆటో లు నడీచే జనం, కాఫీ కొట్టు వాడి రేడియో, వచ్చేవాళ్ళూ వెళ్ళేవాళ్ళతో బస్సులూ ఆటోలూ, ఆమధ్యాహ్నం ఎండ ఎంత తీక్షణంగా ఉందో, జనం అంత రద్దీగా, హడావిడిగా, నిమిశం నించోకుండా తిరుగుతున్నారు.
అఃకయ్య భాయి మొదటి సేవకుడు, రక్షకుడు, కుడి భుజం.
భాయి డబ్బులు వడ్డీకి తిప్పే వ్యాపారం చేస్తాడు.
అందరికీ కాదనకుండా వడ్డీలకి ఇస్తాడుకాని, ఎగ్గొట్టే వాళ్ళని మాత్రం తన మనుషులతో చెప్పి కంట్రోల్ లో ఉంచుతాడు.
వడ్డీ రెగులర్ గా ఇచ్చేవాళ్ళు ఫరవాలేదు.
ఇబ్బందులు ఒచ్చినా, సర్దుకు పోతాడు.
కాని, ఎగ్గొట్టే వాళ్ళను మాత్రం వదలడు.
అవసరమైతే, నాలుగు తగిలించి వసూలు చేస్తాడు.
కొన్ని సార్లు కొంత మంది పీకల మీదక్కూడా తెచ్చు కున్నారు.
అంకయ్య్గనే అన్నీ చూసుకుంటాడు.
వాడి మాటనే కాదు, వాడి కత్తి కూడా వాడి.

గంగన్న భాయి దగ్గర పనికి కుదిరి వసూళ్ళలో సాయపడే వాడు.
గంగన్న తమ్ముళ్ళనూ, చెల్లెళ్ళను పైకి తీసుకురావడం ధ్యేయంగా పెట్టుకుని పని చేయడంతో, తిన్న నాడు తిన్నాడు, లేని నాడు పస్తున్నాడు.
పదేళ్ళ నాటి నుండి, చిల్లర కొట్ట్లల్లొ, టీ బడ్డీలల్లో పనిచేసి,  అయిదు ఆరు ఏళ్ళ నుండి ఇప్పుడిప్పుడు గంగన్న భాయి దగ్గర నిలకడ గా పనిచేస్తున్నాడు.
చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళూ, తమ్ముళ్ళకు వ్యాపారం లో సాయం, ఎలా౦టి అవసరమొచ్చినా, భాయి నడిగి ఆదుకుంటాడు.
కొన్నాళ్ళ క్రితం తల్లికి కాళ్ళనొప్పులు ఎక్కువ అవడంతో, సర్జెరీ చెయ్యాల్సి వచ్చింది. అన్నిటికీ అడిగినట్టే ఈసారి తల్లి కొరకు కూడా అప్పు చేసాడు భాయి దగ్గరే.
భాయి ఏమడగకుండానే సాయం చేసాడు.
అదే ఏరియాలో ఒక రైవల్ లెండర్ ఒచ్చాడు, వాడు లోకల్ వాళ్ళతో బిజినెస్ చేస్తూ, వేరే దేశం లో పనిచేస్తాడు.
వాడు ఆ కంట్రీ లో వేరొక గాంగ్ తో లింకులు పెట్టుకుని, లోకల్ గా విస్తరించాలని చూస్తున్నాడు.
వాడిని అందరూ కల్లూ దాదా అంటారు.
వాడికి సారా భట్టీలు, గుడుంబా, ఇంకా చాలా ఇతర సంబంధమైన వ్యాపారాలు, కాల్ గర్ల్స్ వగైరాలు ఉన్నాయి.
అక్కడ చిన్న చిన్న బిజినెస్ చేయాలనుకునే పల్లె జనాలను కూడా ఆకట్టు కోవాలని పథకం వేసాడు.
ప్రస్తుతం అప్పడిగే వాళ్ళంతా మూస లో పోసినట్టు భాయినే అడుగుతారు.
టర్మ్స్ సరిగ్గానే ఉంటాయి గనక దోఖా లేకుండా ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది.
మోసం చేద్దామని ఆలోచనుంటే గాని, ప్రాణం మీదికి రాదు.
భాయికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరూ దుబాయి లో గ్యాస్ స్టేషన్స్ నడుపుతూ, తండ్రికి కావల్సిన డబ్బు పంపిస్తారు.
భాయ్ చాలా కష్టపడి పైకి తెచ్చాడు కుటుంబాన్ని, ఈరోజు వాళ్ళు చేతికి అంది వచ్చారు.
కల్లూ దాదా అలాక్కాదు.
వాడు రైవల్ గ్యాంగ్ నడపడానికే నియమింప బడ్డాడు.
వాడి సర్కిల్ అంతా, గుండా గర్దీ చేసేవాళ్ళూ, సూడోపొలిటీషియన్ లున్నూ, డ్రగ్ డీలర్స్, అంతా అదో అండర్ వరల్డ్ గూండాలు, లీడర్లు, వాళ్ళ వ్యాపారం కూడా అలా౦టిదే, అన్నీ అండర్ వరల్డ్ డీలింగ్స్.
కల్లూ దాదా భాయిని ఎలాగైనా దెబ్బ తీయాలని, వాడి మనుషులని కొందామని చూస్తున్నాడు.
ఆ సాయంకాలం హోటెల్ సవేరా లో క్వయెట్ గా అంకయ్యని మీటింగ్ కి పిలిచాడు.
" సూడు అన్నా, నీకా భాయి ఇచ్చేదానికి పదింతలిస్తడు మా ఉస్తాద్. యేం బీకుతవ్ గా వసూల్లల్ల.
మాయి కే బచ్చా గాడు, ఆన్ని బట్కోని ఏల్లాడ్తవేన్దిరా?
నడువ్, ఆన్ని ఒదిలేసి మా తానికి రా, మస్తు పైసలున్నయి మా ఓని తాన, మందు గుండ్ల నుండి మందు దాంక మనోన్ని తీసేసేది లేదు పెట్టేది లేదు, ఎవ్వడైనా మాయి కా లాల్.
చల్ బే, ఆన్ని ఒదిలెయ్, పేటిలు సంపాయించేది పోయి చిల్లర పైసల్లల్ల పడ్తవేంది రా?
హౌల గాని వా ఏమన్న?" అన్నాడు.
అంకయ్య కసలే లోలోపల మండుతుంది, "ఇవ్వాల్లరేపు భాయి తాన, తన మాటల కన్న, గా గంగని గాని మాటలే తెగ నడుస్తున్నయి.
నిన్నమొన్న ఒచ్చిండు ఇంట్ల పనోని లెక్క, ఆ బచ్చ గాడు, ఇగ శావుకార్ తీరు మాట్లాడుతాండు, నీ.. " అని మనసులో మంట గా ఉంది వాడికి.
"గంగడు వసూళ్ళకొచ్చిన తాన్నుండి, మనుషులతో, మాట్లాడి పని నడిపిస్తడు, ఆ శారదాంబ ఇస్కూల్ కేమని బోతుండో గాని ఆని పద్దతే మారింది, అప్పు దీస్కున్నోల్ల తోటి మాటలతో నచ్చ జెప్తడు.
చట్! తానట్ల గాదు, కత్తి! కత్తి ఝలిపిస్తే ఆని అబ్బ గూడ ఒనుక్కుంట, ఏంది, ఆ( ఒనుక్కుంటొచ్చి ఇయ్యాలిసి౦దే, నా కాన, గా పప్పులేం ఉడ్కవు, సాలెగాండ్లయి.. "మనసులో అనుకు౦టూ, పైకి మాత్రం, "సరే లే అన్నా అంత జెప్పాల్నా, నాకెర్కే గాని, ఎప్పుడు గల్వ మంటౌ మల్ల?" అని అడిగాడు కల్లూ దాదాని.
కల్లూ దాదా వాని చేతిలొ ఒక కట్ట వంద నోట్లు, ఒక హాండ్ గన్ ఉ౦చి, "మల్లి పనైనాంక కలుద్దాం" అని, "సంగతి సంజాయించిన గద, ఇగ నువ్ ఎట్ల నడ్పుతవో ఏందో కత, మనకి భాయి పోరు లేకుండ జెయ్యి.
జీతం, బత్తెం గొర్రె తోకంత ఎన్నాల్లు జేస్తౌ లే, ఇప్పుడు సంపాయించుకునే టయిం, అంతే" అన్నాడు.

* * * *

ఆ ఉదయం శారదా టీచర్ కెందుకో, మూడో రోజు కూడా పాప రాలేదని మనసులో ఉంది.
దానికి తోడు, వాళ్ళ ఏరియా లో పాలు సప్లయి చేసే కిశన్ చెప్పాడు, రెండు రోజులుగా గంగన్న ఇంటి ముందు, ఎవరూ పాల పాకెట్లు ముట్టలేదు, పిల్లులు కొరికి పడేసిన పాల పేకెట్లు పడున్నాయి ఇంటి గడప ముందు, ఎందుకనో.
గంగన్న ఊరు వెళ్ళి పోతే, ముందే చెప్పేవాడు కదా, అని, "మరి ఏందో, అంకయ్య అనేటోడు వేరే మనుషుల తోటి ఒచ్చిండంట ఎవరో చూసినోల్లు చెప్తె యిన్న" అన్నాడు.
శారద ఇక ఒక్క క్షణం ఆగలేదు, వెంటనే #100 కి ఫోన్ కలిపి మాట్లాడింది.
తరవాత శిశు సంక్షేమ సంస్థ కు కూడా ఇన్ఫార్మ్ చేసింది.
గంట సేపట్లో పోలీసులు, ఆంబులెన్సు, శిశు సంక్షేమ సంస్థ వాళ్ళూ, తలుపులు తీసి వెళ్ళారు గ౦గన్న ఇంట్లోకి.
ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి, వటి౦ట్లోంచి మాత్రం ఏదో అలికిడి ఒస్తుంది.
పాప ఖాళీ పాల సీసా నోట్లో పెట్టుకుని పడుకుని ఉ౦ది నేల మీద పడి ఉన్న గ౦గన్న పక్కనే.
గంగన్న నెవరో తల పై బాగా కొట్టి నట్టుగా, తలకి పెద్ద గాయం ఉంది.
చుట్టూరా గోడలకి చిల్లులు పడ్డాయి, పడి ఉన్న గంగన్న పై రగ్గు కప్పి పక్కనే పడుకుని ఉంది పాప, ఏమీ మాట్లాడ కుండా. ఆంబులెన్స్ లో గంగన్నను ఆక్సీజెన్ ఇస్తూ తీసుకెడుతున్నారు, ఇంకా కొన ఊపిరి ఉంది. రణగొణ ధ్వనులతో దారంతా రద్దీ గా ఉంది, ఆంబులెన్స్ శుశ్రూతా నర్సింగ్ హోమ్ కి వెడుతుంది.
పోలీసులు కేసు ఎఫ్ ఐ ఆర్ ప్రిపేర్ చేస్తున్నారు కిషన్ ని ప్రశ్నిస్తూ.
విజయా స్టుడియోస్ నుండి న్యూస్పేపర్ ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తున్నారు, జర్నలిస్ట్ లు డీటేల్స్ తీస్కుంటున్నారు..
మున్సిపల్ కాలనీ రోడ్డు రద్దీగా సాగిపోతుంది, జనం జీవన సరళి లో సాగుతున్నట్టుగా.....
శారదా టీచర్ శిశు సంక్షేమ సంస్థ కేస్ వర్కర్ కు తెలిపి, పాపను తీసుకుని వెళ్తో౦ది.
పాప పంతులమ్మగుండెల్లో తల దాచుకుంది.


* * * * *

”చీర్స్! దట్ ఇస్ సచ్ ఎ టచి౦గ్ స్టోరీ విజయ్! థ్యా౦క్స్ ఫర్ షేరి౦గ్!" డిమ్ బ్లూ లైట్ల కవతల కనిపి౦చని ట్విన్ టవర్స్ ని తలచుకు౦టూ, కనిపి౦చే ఫ్లడ్ లైట్ల బీమ్స్ చూస్తూ, "నిజమే, ఎ౦త మ౦ది జీవితాలు వస౦తాల గాలి కూడా తెలియకు౦డా వెళ్ళాయి, ఎవరో అదృష్జ వ౦తులకి కలుగుతు౦ది రికవరీ" వినయ్ అ౦టున్నాడు, ట్విన్ టవర్స్ లో నేల రాలిపోయిన వేలకొలదీ జనాలను, ప్రొఫెషనల్స్ ను తలచుకు౦టూ..


రచన: పోచ౦పల్లి ఉమాదేవి