7, డిసెంబర్ 2023, గురువారం

పద్మభూషణా!

0 comments
త్రిదండి చేత, హృదంతరాళమున వెలుగులు ప్రసరిస్తూ,
పదండి ముందుకు పర్యావరణం, జీవ జనోద్ధరణను పాటిస్తూ
కదండి వీరే, రామానుజులూ, రామచంద్రులున్నూ
అందరినుండి కోరేదేమీ లేనే లేదు సుమండీ, 
స్వల్పమైనా మీరు శ్రద్దా భక్తి అలవరచుకొన్న చాలు
ప్రభంజనము వలె ఇక్కట్లొచ్చినా పారద్రోలుదురండి
స్వయంగ తామే రామచంద్రులూ రఘు వీరులు పరివారం
మీరల మీరల మీ మీ వారల వారల వారి వారలనంతా సంరక్షించెదరండీ!
త్రిదండి రామానుజ శ్రీమన్నారాయణ పద్మభూషణా
చిన్న జీయరు వారండీ!

13, నవంబర్ 2023, సోమవారం

శ్రీ మాత్రే నమ:||

0 comments
ఏలా నా మది
విడువలేదు నీ
చల్లని చూపుల
లోపల పలికే మౌన భావనల
సుమ సౌరభాలు
వర్షపు చినుకున
తడిసిన నేలన
పరిమళించునవి
పారిజాతములవలె
నాలోని ప్రతి కణములు
నీ ఆర్ద్రతకు ప్రతిరూపములే
నా కలములోన
కుంచెలలోన
మంగళకరమగు కైమోడ్పులోన
నా మనములోన
కవనమ్ములోన
నడకలోన
కను చూపులోన
చిరునగవులోన
ప్రతిఫలించును
నీదు హృదయం
నీ కరుణలోన
నీ శరణు లోన
కననీయుమమ్మ 
మననీయవమ్మ
ఈ లోకమందు
నీ దీవెనలందు
సదా నీ హృదయమందు


8, ఆగస్టు 2023, మంగళవారం

ఎగరవే‌ ఎగరవే మువ్వన్నెల జెండా

0 comments
“ ఎగరవే‌
ఎగరవే
మువ్వన్నెల జెండా
గగనమే
సోయగాల
రవ్వల వెలుగంగా
ఊగవే
అరుణకాంతుల
నీలి గగన వీధుల పైన
పసిడి పొలములో విరియు
పండు ధాన్య రాశులు 
ఎగరవే‌
ఎగరవే
మువ్వన్నెల జెండా
కూరిమి తో ప్రజల కరువు దీర
సౌభాగ్యములు నిచ్చి ఆనందమిడగా…
దేశదేశాలకే దిశలు తెలుపగా
ముజ్జగాలు ముద్దాడగ,
మువ్వన్నెల జెండా!

9, జులై 2023, ఆదివారం

దాని పాటలోనే పాఠం

0 comments
ముచ్చటగా మూడు పుస్తకాలు
మాట్లాడుకొంటున్నాయి
మేమంటే మేమే గొప్ప అని
పోటీలు పడుతున్నాయి
ముందుగా,మందంగా
ఆర్టు పేపర్ కవర్ తో
స్మార్టుగా తయారైన
సరికొత్త పుస్తకం
నా అట్టలు చూడు,
నా పుటలు చూడు
నా ఆర్టు, పార్ట్ పార్టు జూడు
అని పాట కచ్చేరీలు చేస్తుంది.  
ఓసి నీ కమ్మలు బంగారం గాను,
ఇంతకే? అంది 
బంగారంలా మెరిసిపోతూ, 
మురిసిపోతూ 
మిలమిలలాడే, 
మిరుమిట్లు గొలిపే,
ధగధగలాడే వెన్నెలలా 
మెరిసే మరొక పుస్తక రాజం.
నా క్లాసు చూడు, 
నా భాష చూడు,
నా నెనరు చూడు,
నా ఒనరు చూడు! 
క్లాసిక్, వీరు క్లాసిక్
అని కోర చూపులతో, 
ప్రగల్భాలు కోసి కోసి 
కూస్తుంది ఒక మహా కావ్యం…
ఇంతలో, తందానా
తాన తందనానా అందామని,
గొంతు సవరించుకుని, 
కాగితాలు జారి జారి పోతుంటే,
బీరలు పోకుండా, 
మెడ నిటారుగా నిలిపి
మేకప్ లేకున్నా మైక్ ముందు 
మాట్లాడ దలుచుకున్న వీరుడిలా 
ముఖపత్రమే లేకున్నా, ధైర్యంగా,
సూటిగా, సూటు బూటూ 
ఆర్భాటం లేకున్నా,
చిరునవ్వుతో పులకరిస్తుంది, 
మరొక
దేశవాళీ దిశాకారి, 
పత్రాలు కోల్పోయిన
పాత పుస్తకం.
ఇటు జూడు,
అటెటో కాదు ఇటు సూడండి
అంటున్నది, 
నేనే, నీకు ఓనమాలు
దిద్దించిన పెద్ద బాలశిక్షను
నీ తొలి పాఠం
అందించిన 
తొలి మెట్టును
నీకు తొట్టతొలుత
మెప్పులందించిన
కప్పురపు వసంత
రాయ వాచకాన్ని
అచ్చమైన
మల్లెపూల
తెలుగు వాచకం నేను!
మరచిపోకు మిత్రమా
మనది జన్మజన్మాంతర
బంధం! 
అనుబంధం! 
అంటున్నది!
దాని మాటలోనే
దాగుంది అనంతం!
ఆనందం!
విడువలేని బంధం!