15, జులై 2014, మంగళవారం

యాభై ఒకటవ హ్యూస్టన్ తెలుగు వెన్నెల


తెర తీయగానే, రంగం పైన
చిట్టెన్ రాజు గారు విచ్చేసి యున్నారు.
మధు పెమ్మరాజు గారు, సత్యదేవ్ గారు, సుదేష్ పిల్లుట్ల గారు, సాయి రాచకొండ గారు, అందరూ నిమగ్నమై యున్నారు ఆహూతులను స్వాగతించి, సాహితీ సదస్సు ఆరంభించాలని.
అందరూ హడావిడిగా తిరుగుతున్నారు, 
మధు గారు, సత్య దేవ్ గారు, మల్లిక్ పుచ్చా గారి భాగవత ఐబాం మహా యాగానికి నాంది పలకాలని, ఇంటర్నెట్ తో తంటాలు పడుతున్నారు, సుధేష్ గారు వైఫై ఉందా అని, పరిశోధిస్తున్నారు, జనం ఒక్కొక్కళ్ళూ వచ్చ్ ఆసీనులౌతున్నారు, హడావిడి మొదలయ్యింది. ఠంచనుగా అయిదు గంటలకి, కారులో దిగి వస్తున్నారు, రసరాజు గారు,  వెన్నెలకంటి వారు, వారిని తోడ్కొని వచ్చిన సాహితీ పెద్దలు.

హ్యూస్టన్ సాహితీ లోకానికి, సభా సదస్యులకు, స్వాగతం పలికి, రస రాజు గారిని, వెన్నెలకంటి వారిని వేదికమీదికి ఆహ్వానించి, యాభై ఒకటవ హ్యూస్టన్ తెలుగు వెన్నెలను, సాహితీ విభావరిని ఆరంభించారు, చిట్టెన్ రాజు గారు. సత్యదేవ్ గారు, మధు పెమ్మరాజు గార్లు గౌరవ అతిథులని పరిచయం చేయగా, 
సాహితీలోకానికి అభినందనలను తెల్పుతూ, 
రసరాజు గారు సరస హృదయులతో
సారస హృదయంతో, కవితాగానం చేసారు

1. రస రాజు గారు రాసిన కవిత:
ఆధునిక తెలుగు కవులు అపురూప భావాలు
నెల నెలా తెలుగు వెన్నెలా!
పిలచినావు నేడు నన్నిలా! 
ఎంత తీయనైన మనసు నీ సొంతం
హృదయ సీమ ఎప్పుడూ రసవంతం 
సంస్కృతి నీ జెండాగా రెపరెపలాడింది 
సరసకళా దీపిక గా వెలుగులు చిమ్మింది 
హ్యూస్టన్ లో ఉంటున్నా నీకెల్లలు లేవు
ఉప్పొంగే ధ్యేయానికి చీకటులే లేవు 

విచ్చేసిన వారిలో ఎందరెందరో హ్యూస్టన్ వాసులు, తెలుగు భాషాభిమానులు, ఎల్లలు లేకుండా వెల్లువలై పొంగుతున్న సాహితీ సౌరభంలో ఉక్కిరి బిక్కిరౌతూ, రాసుకున్న కొన్ని నోట్స్:
రసరాజు గారి సారస్వత ప్రవాహంలో దొరికినకొన్ని ఆణిముత్యాలు:

"ఆంధ్ర దేశానికే పెద్ద దిక్కు వంగూరి చిట్టెన్ రాజు గారు, 
వీరభద్ర రావు గారి శ్రీమతి వాణి
వాణి నా రాణి అన్నారెపుడో పిల్లలమర్రి పినవీర భద్రుడు 
పాట కంటె బాగున్నది ఈ మాటా!
పస్తున్నా బాధ లేదు ఈ పూటా!
ఆధునిక తెలుగు కవుల అపురూప భావాలు 
రూపు దాల్చినవి
పద్యం
పాట
కథా
వ్యాసం
మినీ కవిత ఆదులుగా సాహిత్య గవాక్షంలో 
 
విశ్వనాథ సత్యనరాయణ గారు
జాషువా గారు, ఎందరెందరో మహాకవులు వారి పాత్రలు పోషించి, వెళ్ళినారు మనకీ లోగిలిని పేర్చి, 
అవలోకన చేద్దాం! రండి, రారండీ!"

2. ఉటంకిస్తున్నారు ఎంతో అద్భుతముగా వారు, సాగుతుంది సాహితీ సౌరభాల పరీమళం 
రసమయ సాహితీ విభావరిలో, నా పైత్యం కొంత జోడిస్తూ, అందిస్తున్నాను వారు అందించిన రత్నాలను

ఆధునిక కవుల పద్య రచనా రసమయ రసధుని 
ఎవరు తెలుప గలరు రసాస్వాదన తో రస రాజు గారు వినా
విశ్వనాథ వారు విరచించిరి విరించి వలె
జాషువా గారి పద్యరత్నాలు, అమొఘ భావనలతో 
నలరించు సామాన్యమును అసామాన్యతతోడ  
శ్రీ శ్రీ గారి సిరులొలుకు సిరిసిరిమువ్వ
తెల్పనగునా చిన్ని చురకలతో బాటు పెను రచనా స్రవంతులు.
జాలువారు, తేనెలొలుకు తెలుగు మాటలై, పాటలై, సాగెనదే 
తిరుపతి వెంకట కవుల చమత్కార వర్ణనలో వెంట వెంట,
తిలక్ గారు కాళొజి నారాయాణ గారు 
ఆరుద్ర, గారి కూనలమ్మ పదాలు;
సినిమా రచయితలు అలరించు పదాలు
వేదములై చిందించు శివరంజని రాగాల సోయగములు 

ఘనరాగాల గజల్ రాయుటకై
రాత్రి పడిన నిద్రలేమి అవస్థలు, 
తలపులన్ని నోరారా పాడుటకై పడిన తపన
అలవి యగునా మాటలలో పొందుపరువ, రయ్యన?

పరువంపు బొమ్మలపై గుమ్మరించు భావనలేనా
ఇంటిలోని ఇంతికొరకు రాసిన రసమయ గుళికలు 
చేసే ప్రతిపనిలోనా దాచిన హ్రుదయాన్ని 
వెలికి తెచ్చి పంచుకొనెడు రసరాజు కవితారసాలు

3. బచ్చాలకు బహుమతి, అచ్చంగ అందరికీ: 

మల్లిక్  పుఛ్ఛా గారు చేపట్టిన యాగం  
భాగవత ఆణిముత్యాల వ్రాలు 
బమ్మెర పోతన గారి పద్యాలు 
పొందు పరుచు ఆణిముత్యముల మాలల వలె ఆనవాలు 
ఐబాం అను బాం అన్ని రకముల వేదనలకు అమృతాంజనము!
కూర్చిన పెద్దలకెల్లరకు జేజేలు! జేజేలు! 
హ్యూస్టన్ నగరం లోనే కాదు భారతమున పాల్గొన్న 
పార్థసారధి తానై అందించిన ఆహ్లాదన
పాటపాడెను వెన్నెల వెలుగుల వాకలుగా తానే
వీలగునా కొనుగొలు కొంత, వచ్చు ముందు తరములకై 
భవ్యమైన భవిత నొసగ భావి తరముల వారలకై?
సుంత స్వార్థము మాని, చేతము ప్రయత్నము కొంతైనా, అందులకై. 


4. తెలుగు వెన్నెలలో జాలు వారిన వెన్నెల: 

వెన్నెలకంటి వారు వెల్లువగా వర్ణించుచు 
సాహిత్యనికి ఆత్మ బంధువులు గా శ్లాఘించిరి, 
తెలుగు వెన్నెల రాజు గారు, మన చిట్టెన్ రాజు వంగూరి వారు!
మా అభిమాన ఆంధ్ర భోజులై విరాజిల్లెడు తెలుగు వెలుగు! 
రేడు కదా! నెల నెలా విరుయును మరి వెన్నెలా!
స్వీయ కవితా సుధల వ్రాలు,
నాటకాలు, బుర్రకథలు, సాహిత్యపు తొలి మెట్లుగ, 
సినిమా రచనలన్నీ హౌస్ఫుల్ హిట్టనుచు 
విట్టు వేసి, మాటలతో జనాలను ఆకట్టు కొనుచు
వివరించిరి పాటలలో మాటలలో సౌందర్యము
చలన చిత్ర సాహిత్యాలలో విచిత్రాలు
పాత్రలలో అందించు కవి హృదయం, 
కవి సమయం!
సాధరణ ప్రజలు కూడా రాయగలమని భావించు 
కవితలల్లిన యదే కవిత్వము నేడు, 
ఆ కవిత లల్లగల్గినపుడు అందును
ప్రజల జీవనాడి నేడు

చెంగావి రంగు చీరల సంధ్యారుణ కాంతులను
 ఆరడుగుల బుల్లెట్ తో బంధూకపు సంధ్యా రాగం

ప్రస్తుత కాలపు విలువలు ఎన్నటికీ క్రొత్తవే
అది ద్వాపర యుగ ద్వారమైనా
ఆధునిక కాలమైనా!
సహజం ఇది సహజం అని తెలియ జేయు 
వెన్నెలకంటి, కవి గాంచిన
ఆందాలను రవళించె గానామృతం.
ఆధునిక కవుల చమత్కార పంచకములు (పంచ్!)
వర్ణించ వెన్నెలకంటి, విపంచికే పలుక నేర్పు 
పాటలలొ పొంచి వున్న గణవిభజన తానా నా
గానాలలో  గమకాలు, సరిగమల చమక్కులు
మాట రాని మౌనమిది మాకు మాటలే నేర్పినదీ
ఎన్ని గాధలు ఇందులో?
అనువాదాలు అందులోని బాధలూ!
రాయవలెను గేయ రచయిత
ఇంకు తోడ సింకు చేయ
తెలుగు సౌరభం అందించగ
అచ్చమైన తెలుగు పాట ఇదే సుమా అనిపించగ
సున్నాలు ఉన్నణ్ణాళ్ళూ తెలుంగే అది తెలియవోయ్ 

5. హ్యూస్టన్ సాహితీలొకం, టిసియే హ్యూస్టన్, వారి అభిరుచి, వర్ణించ తరమా?

నవరసాలందించు నగరమీ హ్యూస్టన్
తెలియజెప్పు ఎల్లరకూ టిసియే హ్యూస్టన్, 
వారి కార్యవర్గములకు వేయండీ వీర త్రాళ్ళు 
పొంగి పొరలు అభిమానం జనుల మనుల 
కను కొలనుల ఎనలేని దీవెనలై 
పెనవేయాలి మీ హృదయానంద భావములై  
తీవెలై, పూవులై కవిత్వము చిగురించవలె
సుమనోహర కావ్యమాలలై
అండ దండగా సాహితీలోకము ఉండగా,
కాదే యది పండగా, సమ్రంభముగా.

అభినందనలు అభిరుచి వారి ఎనలేని రుచికి
హ్యూస్టన్ సాహితీ లొకం సాహిత్య కృషి కి! 
సాగించెదమీనాడు మన యానం సాహిత్యానికి మరింత చేరువవగా
సమ్మోహితులై కూర్చు0డిపోయిన జనాలను చైతన్య పరచి సుదేశ్ వారూ, టీం
టెంపుల్ లో జరుగు హరికథలను తెలియ పరచి, రుక్మిణీ కళ్యాణమునకు
ఆహ్వానాలందించి, అందులో నర్మ గర్భ చమత్కారములు వివరించిరి
వదల లేక వదలలేక వెళ్ళలేని వారలకు, మరికొన్ని పకోడీలు పట్టుకెళ్ళండనుచు, శాయి గారు తిరిగి మరల కలుద్దాము త్వరలోనేయని, నిష్కామ కర్మతోడ అభ్యుదయమునకై పాటు పడుచు
సాదరముగ టిసియే ప్రెసిడెంట్ మారుతీ రెడ్డి గారు, చిట్టెన్ రాజు గారు, శాయి గారు, పలువురు సాహితీ పెద్దలు,  
వారు సమ్మానించిరి ముఖ్య అతిథుల, యెల్లరను, హృదయాలానంద డోలాయమానముగా 
ప్రేమమీరగ చిత్రాలు తీసుకొనిరి అతిథులతో, మళ్ళీ యెపుడో కదా మరి మనమంతా కలిసేదని...
గరం గరం చాయ్ తోడ నరం నరం కబుర్లాడుతూ వరం గా భావించెదమీ సాహితీవన సౌరభం!
శుభం!  

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి